బుల్డోజర్లను దింపిన ఇజ్రాయెల్
ABN , First Publish Date - 2023-11-11T05:27:17+05:30 IST
గాజాను సమూలంగా నేలమట్టం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఆ దిశలో అడుగులు వేస్తోందా
గాజాలో మొండి గోడలూ నేలమట్టం
అల్-షిఫా సహా 6 ఆస్పత్రులపై షెల్లింగ్
26 మంది ఉగ్ర కమాండర్ల హతం
సిరియాపై ఇజ్రాయెల్ దాడులు
గాజాను సమూలంగా నేలమట్టం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయెల్ ఆ దిశలో అడుగులు వేస్తోందా? బాంబు దాడులతో ఇప్పటికే ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు ధ్వంసమై కనిపిస్తున్న మొండి గోడలను కూడా కూల్చేయాలని నెతన్యాహు సర్కారు నిర్ణయించిందా? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) గ్రౌండ్ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులతోపాటు.. బుల్డోజర్లు ఉండడం.. గాజాలో ప్రస్తుత పరిస్థితులు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. మూడ్రోజుల క్రితమే సెంట్రల్ గాజాలోకి ప్రవేశించిన ఐడీఎఫ్.. బుల్డోజర్లతో మౌలిక సదుపాయాలను, ఇళ్లను నేలమట్టం చేస్తోంది. జెరూసలేంలో పాలస్తీనా మద్దతుదారుల ఇళ్లను ఐడీఎఫ్ బుల్డోజర్లతో కూల్చేస్తోందని గాజా కేంద్రంగా పనిచేస్తున్న అల్-హుర్రా, లెబనాన్, వెస్ట్‌బ్యాంక్ కేంద్రంగా సేవలందిస్తున్న అల్‌నష్రా వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. హమా్‌సపై ప్రతీకారం పేరుతో సామాన్యులకు సామూహిక శిక్షలు విధించడం తగదంటూ ఐరాస శుక్రవారం ఇజ్రాయెల్‌ను తీవ్రస్థాయిలో మందలించింది. అమెరికా కూడా బుల్డోజర్ చర్యలను తప్పుబట్టింది. గాజాలోని అల్-షిఫా ఆస్పత్రిలో హమాస్ ప్రధాన కమాండ్ కంట్రోల్ ఉందంటూ ఇజ్రాయెల్ ఆరోపించిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఆ ఆస్పత్రిపై బాంబుదాడులు చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. అల్-షిఫా ఆస్పత్రి పరిసరాల్లో జరిగిన భీకర యుద్ధంలో ఏడుగురు పౌరులు మృతిచెందారని తెలిపింది. శుక్రవారం ఇజ్రాయెల్ గాజాలోని ఆస్పత్రులు, స్కూళ్ల(శరణార్థి శిబిరాలు)పై జరిపిన దాడుల్లో 50 మందికి పైగ చనిపోయినట్లు సమాచారం. కాగా, గాజాలో మొత్తం మరణాల సంఖ్య 11 వేలకు చేరింది. అల్-జజీర, వఫా వార్తా సంస్థలు దాడుల దృశ్యాలను ప్రసారం చేశాయి.
19 మంది హమాస్ నేతల మృతి
ఐడీఎఫ్ శుక్రవారం తెల్లవారుజాము నుంచి సెంట్రల్ గాజా నగరంలో దాడులను ఉధృతం చేసింది. జబాలియాలో భూ, గగనతల దాడులు చేసింది. ఇక్కడ 19 మంది హమాస్ కీలక కమాండర్లు, నేతలు మృతిచెందారని, వారిలో అహ్మద్ మూసా, మహమ్మద్ కహ్లాత్ ఉన్నట్లు ఐడీఎఫ్ తన బులెటిన్‌లో తెలిపింది. అటు ఇజ్రాయెల్ ఉత్తరం వైపు.. లెబనాన్ భూభాగం నుంచి హిజ్బుల్లా ఉగ్రవాదులు దాడులను ఉధృతం చేశారు. ఐడీఎఫ్ జరిపిన ప్రతిదాడుల్లో ఏడుగురు హిజ్బుల్లా కమాండర్లు చనిపోయినట్లు లెబనాన్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇరాన్ మద్దతున్న ‘హుతీ’ ఉగ్రవాద సంస్థ కూడా మధ్యధరా సముద్రం మీదుగా ఇజ్రాయెల్‌ను టార్గెట్‌గా చేసుకుంటోంది. శుక్రవారం యెమన్ తీరంలో అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను కూల్చేసినట్లు.. పశ్చిమాసియాలోని 40 అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడ్డట్లు హుతీలు ప్రకటించగా.. హుతీలకు గట్టి గుణపాఠం చెబుతున్నామని వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. సిరియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులపై రాకెట్ దాడులు జరిపినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా సిరియాలోని డమాస్కస్, సరిహద్దు ప్రాంతాలైన అఖ్రాబా, సయ్యిదా జీనాబ్‌పై దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు సిరియా ఫైటర్లు చనిపోయినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ట్రిపుల్ హెచ్(హమా్‌స, హిజ్బుల్లా, హుతీ) ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నట్లు ఐడీఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. - సెంట్రల్ డెస్క్






