Jagan Vs Mamata : సంపన్న సీఎం జగన్.. నిరుపేద ముఖ్యమంత్రి మమత..
ABN, First Publish Date - 2023-04-12T19:05:48+05:30
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మన దేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు.
న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) మన దేశంలో అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) నిరుపేద ముఖ్యమంత్రిగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) ఈ వివరాలను వెల్లడించింది. దేశంలోని ముఖ్యమంత్రుల ఎన్నికల ప్రమాణ పత్రాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.
ఏడీఆర్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డికి రూ.510 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రుల ఆస్తులన్నిటినీ కలిపినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ అత్యధికం.
మమత బెనర్జీకి గల స్థిర, చరాస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఆమెకు స్థిరాస్తులు లేనేలేవు. రూ.1 కోటి కన్నా తక్కువ సంపదగల ఏకైక ముఖ్యమంత్రి ఆమె. నిరుపేద ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.1 కోటి మాత్రమే.
సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో జఃగన్మోహన్ రెడ్డి తర్వాతి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెము ఖండు (Pemu Khandu) నిలిచారు. పెము ఖండు ఆస్తుల విలువ రూ.163 కోట్లు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik)కు రూ.63.87 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి. నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో (Neiphiu Rio) ఆస్తుల విలువ రూ.46 కోట్లు. పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామికి రూ.38 కోట్ల విలువైన సంపద ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma)కు రూ.17 కోట్లు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా (Conrad Sangma)కు రూ.14 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు ఆస్తుల విలువ రూ.23.5 కోట్లు కాగా, ఆయనకు రూ.8.8 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎక్కువ అప్పులు ఉన్న ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ తొలి స్థానంలోనూ, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై రెండో స్థానంలోనూ ఉన్నారు. బొమ్మైకి రూ.4.9 కోట్ల అప్పులు ఉన్నాయి. బొమ్మై ఆస్తుల విలువ రూ.8.92 కోట్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు రూ.11.6 కోట్ల విలువైన ఆస్తులు, రూ.3.75 కోట్ల అప్పులు ఉన్నాయి.
దేశంలోని మొత్తం 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మందిపై తీవ్రమైన క్రిమినల్ నేరారోపణలు ఉన్నాయని, 29 మంది ముఖ్యమంత్రులు కోటీశ్వరులని ఈ నివేదిక తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం
Varun Gandhi : యోగి ప్రభుత్వానికి వరుణ్ గాంధీ వినతి
Updated Date - 2023-04-12T19:42:53+05:30 IST