JLF: ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ 16వ ఎడిషన్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-01-19T20:28:50+05:30
‘పింక్ సిటీ’గా (Pink City) పేరొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) కేంద్రంగా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ (JLF) గురువారం ప్రారంభమైంది.
జైపూర్: ‘పింక్ సిటీ’గా (Pink City) పేరొందిన రాజస్థాన్ రాజధాని జైపూర్ (Jaipur) వేదికగా ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ (Jaipur Literature Festival) గురువారం ప్రారంభమైంది. విలియం డాల్రింపుల్ ( William Dalrymple), నమితా గోఖలే (Namita Gokhale), సంజయ్ కే.రాయ్ (Sanjoy K. Roy) వంటి ప్రముఖ రచయితల ప్రసంగాలతో 16వ ఎడిషన్ ఫెస్టివల్ ఘనంగా మొదలైంది. జైపూర్‌లోని ‘హోటల్ క్లార్క్స్ అమీర్’లో 5 రోజులపాటు కొనసాగనున్న ఈ ఫెస్టివల్‌లో వేర్వేరు దేశాలకు చెందిన 350కిపైగా మంది వక్తలు పాల్గొననున్నారు.
జేఎల్ఎఫ్ ప్రారంభం సందర్భంగా రచయిత రాయ్ మాట్లాడుతూ.. 2020 ఎడిషన్‌లో హాజరైన వారిలో 80 శాతం మంది 25 ఏళ్లలోపు వారేనని, ఈ యువతను భవిష్యత్‌లో జీరో కార్బన్ (Carbon neutral) దిశగా అడుగులు వేయించడమే ప్రస్తుత ఫెస్టివల్ ప్రయత్నమని చెప్పారు. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు లిటరేచర్ ఫెస్టివల్‌ను చేరువ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ‘ప్రథమ్ బుక్స్’తో భాగస్వామ్యం ఏర్పరచుకుని వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం 50 పాఠశాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.
రచయిత నమితా గోఖలే మాట్లాడుతూ.. ఈ ఫెస్టివల్ విభిన్న భాషలకు ప్రాతినిథ్యం వహిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఎడిషన్‌లో 20 భారతీయ భాషలు, 14 అంతర్జాతీయ భాషలు ప్రతిబింబించనున్నాయని తెలిపారు. ఇక విలియం డాల్రింపుల్ మాట్లాడుతూ.. నోబెల్ ప్రైజ్ అందుకున్న అబ్దుల్ రజాక్ గుర్నా, మ్యాన్ బుక్ ప్రైజ్ విన్నర్లు గీతాంజలి శ్రీ, డైసీ రాక్‌వెల్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులు దక్కించుకున్న పలువురు రచయితలు ఈ ఎడిషన్‌లో ప్రసంగించబోతున్నట్టు వెల్లడించారు.
Updated Date - 2023-01-19T20:30:33+05:30 IST