Karnataka Election Results : అతి తక్కువ ఓట్లతో గెలుపు.. అవాక్కయిన ప్రత్యర్థులు..
ABN, First Publish Date - 2023-05-14T12:05:53+05:30
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 43 శాతం ఓట్లు సాధించి 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ప్రత్యర్థులను
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 43 శాతం ఓట్లు సాధించి 135 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి, ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. అయితే 5,000 కన్నా తక్కువ ఓట్లతో గెలిచిన స్థానాలు 12 ఉన్నాయి. 42 స్థానాల్లో హోరాహోరీ పోటీ జరిగింది. వీటిలో 22 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 17 స్థానాల్లోనూ, జేడీఎస్ మూడింటిలోనూ విజయం సాధించాయి.
2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో 5,000 కన్నా తక్కువ ఓట్లతో అభ్యర్థులు విజయం సాధించిన స్థానాలు 30. ఈసారి ఇటువంటి స్థానాలు 42 ఉన్నాయి. 2023లో 1,000 కన్నా తక్కువ ఓట్లతో ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. వీరంతా బీజేపీ అభ్యర్థులపైనే గెలిచారు.
జయ నగర్ ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే సౌమ్య రెడ్డిపై కేవలం 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి సీకే రామ మూర్తి విజయం సాధించారు. 2023లో అతి తక్కువ మెజారిటీ 16 ఓట్లు కాగా, 2018లో అతి తక్కువ మెజారిటీ 213 ఓట్లు.
సెంట్రల్ కర్ణాటకలో మూడు స్థానాల్లోనూ, బెంగళూరు రీజియన్‌లో రెండు స్థానాల్లోనూ అభ్యర్థులు 1,000 కన్నా తక్కువ ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
కాంగ్రెస్ 20,000 కన్నా ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో గెలిచిన స్థానాలు 63. అయితే 2018లో ఈ స్థాయి మెజారిటీతో 20 స్థానాల్లో ఆ పార్టీ గెలిచింది. 2023లో గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల కన్నా ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో 74 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ స్థాయి ఆధిక్యంతో 2018లో 23 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీకే శివ కుమార్ 2023లో కనకపుర నియోజకవర్గంలో 1.2 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఆయన 2018లో ఇదే స్థానం నుంచి 79,909 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
2023లో 111 నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. వీటిలో 103 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. వీటిలో 73 స్థానాల్లో విజేతలు 10,000 కన్నా ఎక్కువ ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
2023లో మొత్తం మీద 95 నియోజకవర్గాల్లో 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో అభ్యర్థులు గెలిచారు. వీటిలో సగానికిపైగా ముంబై-కర్ణాటక, పాత మైసూరు ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలే. ఎనిమిది స్థానాల్లో విక్టరీ మార్జిన్ కన్నా ఎక్కువ ఓట్లు నోటాకు లభించాయి. వీటిలో ఐదింటిలో కాంగ్రెస్ గెలిచింది. మూడింటిలో బీజేపీ గెలిచింది.
ఇవి కూడా చదవండి :
Kothapaluku : నియంతృత్వ పోకడల నుంచి ఉపశమనం
Maharashtra : ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై హింసాత్మక ఘర్షణలు.. పలువురు పోలీసులకు గాయాలు..
Updated Date - 2023-05-14T12:05:53+05:30 IST