Karnataka Assembly Elections: 80 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటింగ్
ABN, First Publish Date - 2023-03-29T14:39:59+05:30
కర్ణాటకలో భారీగా వృద్ధుల ఓట్లు ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం..
న్యూఢిల్లీ: కర్ణాటకలో భారీగా వృద్ధుల ఓట్లు ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు వేసే సదుపాయం కల్పిస్తున్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ప్రకటించారు. దివ్యాంగులకు కూడా ఇంటివద్ద నుంచే తమ ఓటు హక్కును వినిగించుకోవచ్చని చెప్పారు. మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తున్నట్టు బుధవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. మే 13వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్సీలకు 36, ఎస్టీలకు 15 రిజర్వు చేశారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షల మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 5.21 కోట్లు, అందులో మహిళా ఓటర్లు 2.59 కోట్ల మంది. తొలిసారిగా ఓటు హక్కు నమోదైనవారు 9.17లక్షల మంది, శతాధిక వృద్ధులు 16,976, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 4,699 మంది ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షలు, వికలాంగ ఓటర్లు 5.55 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేష న్లు 58,272. వీటిలో 24,063 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కోపోలింగ్ స్టేషన్‌కు సగటున 883 మంది ఓటర్లు ఉంటారు. 1,320 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 224 కేంద్రాలను యువత, మరో 224 కేంద్రాలను వికలాంగులు నిర్వహించనున్నట్టు సీఈసీ తెలిపారు. 1,200 క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు చెప్పారు. 29,141 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించనున్నట్టు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 24న ముగియనున్నందున ఆ లోపే ఎన్నికలు జరపాల్సి ఉందన్నారు. పక్షపాతంతో వ్యవహరించే ఎన్నికల అధికారులపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదే తొలిసారి..
కర్ణాటకలో 80 ఏళ్లు దాటినవారికి ఇంటి నుంచే సదుపాయం కల్పించడం ఇదే తొలిసారని రాజీవ్ కుమార్ తెలిపారు. తమ బృందాలు ఫారం-12డీతో అలాంటివారి ఇళ్లకు వెళ్లి ఓటు వేసే సదుపాయం కల్పిస్తాయని చెప్పారు. వీరు ఎవరికి ఓటు వేస్తున్నారనే గోప్యత పాటిస్తామని, ఈ ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీయిస్తామని తెలిపారు. వికలాంగుల కోసం ‘సాక్షం’ అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టామని, వారు దానిలోకి లాగిన్ అయ్యి, ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లు, అఫిడవిట్లు దాఖలు చేసేందుకు ‘సువిధ’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించామని చెప్పారు. ఎన్నికల ర్యాలీలు, సమావేశాలకు అనుమతికి కూడా అభ్యర్థులు సువిధ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చన్నారు.
Updated Date - 2023-03-29T14:39:59+05:30 IST