Kavery water: సుప్రీంకోర్టుకు ‘కావేరి’ వివాదం
ABN, First Publish Date - 2023-08-31T08:40:27+05:30
తమిళనాడు - కర్ణాటకల మధ్య నెలకొన్న కావేరి జల వివాదం(Kavery water dispute) మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక ప్రభుత్వ
- రేపు రాష్ట్రప్రభుత్వం అప్పీలు పిటిషన్
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తమిళనాడు - కర్ణాటకల మధ్య నెలకొన్న కావేరి జల వివాదం(Kavery water dispute) మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటక ప్రభుత్వ మొండివైఖరికి తోడు కావేరీ నిర్వాహక మండలి తాజా నిర్ణయం పట్ల ఏమాత్రం సంతృప్తిగా లేని రాష్ట్రప్రభుత్వం.. మరోమారు సుప్రీం తలుపు తట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలు పిటిషన్ దాఖలు చేయనుంది. డెల్టా జిల్లాల్లో కురువై సాగును కాపాడుకునేందుకు కావేరి జలాలను విడుదల చేయాలంటూ రాష్ట్రప్రభుత్వం కర్ణాటకకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాష్ట్రప్రభుత్వం కావేరి నిర్వాహక మండలిని ఆశ్రయించింది. కురువై సాగు కోసం కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) కావేరి నదిలోకి సెకనుకు 24 వేల ఘనపుటడుగుల నీరు విడుదల చేయాల్సి ఉందని, ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. దీనిపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కావేరి నిర్వాహక మండలి.. పలుమార్లు భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే. అయితే కబిని, కృష్ణరాజసాగర్ సహా తమ వద్ద వున్న నాలుగు డ్యాంలలోనూ జలాలు అడుగంటాయని, తమ రాష్ట్ర రైతులకే అది ఏమాత్రం సరిపోదేని మొండి వాదనలు చేసిన కర్ణాటక... తాము కేవలం సెకనుకు 3 వేల ఘనపుటడుగుల నీటిని మాత్రమే విడుదల చేయగలమని పేర్కొంది. ఇరు రాష్ట్రాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న కావేరి నిర్వాహక మండలి.. వచ్చే 15 రోజుల పాటు సెకనుకు 5 వేల ఘనపుటడుగుల చొప్పున తమిళనాడు(Tamil Nadu)కు నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆ ప్రకారం, రోజుకు 0.4 టీఎంసీల చొప్పున 15 రోజులకు సుమారు 6 టీఎంసీల నీరు రాష్ట్రానికి చేరనుంది. అయితే కావేరి నిర్వాహక మండలి ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటక(Karnataka) ప్రభుత్వం వదిలే నీరు తమ రైతులకు ఏమాత్రం సరిపోదని, ఆ నిర్ణయంతో డెల్టా జిల్లాలు ఎడారిలా మారడం ఖాయమని అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేగాక ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేసింది. నీటి పారుదలశాఖ మంత్రి దురైమురుగన్ మాట్లాడుతూ.. కావేరి నిర్వాహక మండలి రాష్ట్ర వాదనల్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. మరోమార్గం లేనందున సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించామని, ఆ మేరకు సెప్టెంబరు 1వ తేదీన సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రప్రభుత్వం ఇదివరకే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. ఆ సమయంలో రాష్ట్రప్రభుత్వం తరఫున అప్పీలు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా వుండగా కర్ణాటక డ్యాంలలోని నీటిమట్టాలపై నివేదిక దాఖలు చేయాలని గతంలోనే కావేరి నిర్వాహక మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు గురు, శుక్రవారాల్లో కావేరి నిర్వాహక మండలి నివేదిక దాఖలు చేయనుందని, ఆ నివేదిక ప్రకారం కావేరి జలాల విడుదలపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొనే అవకాశముందని రాష్ట్రప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Updated Date - 2023-08-31T08:40:28+05:30 IST