Kharge, Rahul: దక్షిణాదిన కర్ణాటకే కీలకం.. టార్గెట్ 20 ఎంపీ స్థానాలు..
ABN, First Publish Date - 2023-08-03T13:27:44+05:30
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రాల వారీగా ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభిం
- లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం కండి
- రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఖర్గే, రాహుల్ దిశానిర్దేశం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రాల వారీగా ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. దక్షిణాదిన కర్ణాటకలోనే అత్యధిక స్థానాలు గెలిచేందుకు అవకాశం ఉందని భావిస్తున్న అధిష్టానం తొలుత ఈ రాష్ట్రం నుంచే తన వ్యూహాల రూపకల్పనకు బుధవారం శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) కర్ణాటక నేతలకు దిశా నిర్దేశం చేశారు. విభేదాలను పక్కనపెట్టి గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన కీలక సమావేశంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Chief Minister Siddaramaiah and Deputy Chief Minister DK Shivakumar)తోపాటు రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్, సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల ప్రగతిని రాహుల్‌గాంధీ స్వయంగా ఆరా తీశారు. కర్ణాటక గ్యారెంటీ పథకాల మోడల్‌ను 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా ప్రచారం చేసి సామాన్య ప్రజలను ఆకట్టుకునే వ్యూహంతో కాంగ్రెస్ అధిష్టానం చకచకా పావులు కదుపుతోంది.
ఆశలన్నీ గ్యారెంటీ పథకాలపైనే..
కర్ణాటక గ్యారెంటీ పథకాలను మోడల్‌గా తీసుకుని 2024 లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో చేర్చే దిశలో కాంగ్రెస్ పక్కా వ్యూహాలతోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాహుల్‌గాంధీ కర్ణాటకలో సక్సెస్ అయిన గ్యారెంటీ పథకాల ప్రగతిపై దృష్టి సారించారు. లోక్‌సభ ఎన్నికల నాటికి అర్హులైన లబ్ధిదారుల ముంగిట పథకాలు చేరేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాహుల్‌గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ప్రతిరోజూ గ్యారెంటీ పథకాల ద్వారా కోటిన్నరమంది ప్రయోజనం పొందుతున్నారని, ప్రత్యేకించి శక్తి పథకం మహిళల్లో అపూర్వమైన చైతన్యం తెచ్చిందని సీఎం వెల్లడించగా రాహుల్‌గాంధీ సైతం శెహబాష్ అంటూ ప్రశంసలు కురిపించినట్టు సమాచారం. గృహజ్యోతి పథకం కూడా అమలులోకి వచ్చిందని, అన్నభాగ్య పథకానికి బియ్యం ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని అయినా ప్రజల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నామని సీఎం అధిష్టానం పెద్దలకు వివరించారు. గృహలక్ష్మి పథకాన్ని కూడా ఈనెలలోనే పక్కాగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన రాహుల్ దృష్టికి తెచ్చారు. ఐదు గ్యారెంటీ పథకాలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన 76 హామీలను అమలు చేస్తూ బడ్జెట్‌లో ప్రకటించామని సీఎం అధిష్టానం పెద్దలకు తెలిపినట్టు సమాచారం. మణిపూర్, హరియాణా విద్వేష రాజకీయాల వెనుక బీజేపీ, సంఘ్ పరివార్ బలమైన వ్యూహం ఏదో కనిపిస్తోందని, బహుశా హిందూ ఓట్లను క్రోడీకరించడమే వారి లక్ష్యం కావచ్చునని, దీన్ని గ్యారెంటీ పథకాలతో విజయవంతంగా తిప్పికొట్టవచ్చునని సమావేశంలో ప్రసంగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
అధిష్టానం మెచ్చుకుంది : సీఎం
రాష్ట్రంలో సామాన్యులు, నిరుపేదల సంక్షేమానికి గాను చేపట్టిన ఐదు గ్యారెంటీ పథకాల అమలుపై అధిష్టానం పెద్దలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని, ఈ పథకాలను మరింత పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారని సమావేశం అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. అధిష్టానం మార్గదర్శకాలకు అనుగుణంగానే నేతలంతా శాసనసభ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసికట్టుగా పోరాడి దక్షిణాది నుంచి 20కుపైగా లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానానికి బహుమానంగా అందచేయడం తథ్యమని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మొత్తానికి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిన అందునా కర్ణాటకలో కనీసం 20-24 స్థానాలను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ తన వ్యూహాలకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి రాష్ట్రం నుంచి మంత్రులతో సహా 50 మందిని అధిష్టానం ఆహ్వానించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు 20-24 స్థానాలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మెజారిటీ నేతలు అధిష్టానం పెద్దలకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న రాహుల్‌గాంధీ అభ్యర్థుల కొరతను అధిగమించేందుకు పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించాలని సూచన చేసినట్టు కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ తెలిసింది. ఈ లెక్కన పలువురు సీనియర్ నేతలతోపాటు ఇద్దరుముగ్గురు మంత్రులను లోక్‌సభ బరిలో దించే ఆలోచనలో ఉన్నట్టు ఈ వర్గాలు అంటున్నాయి. జిల్లాలవారీగా కాంగ్రెస్ ప్రముఖులు, కార్యకర్తల అభిప్రాయాలను క్రోడీకరించి తనకు సాధ్యమైనంత త్వరగా ఒక నివేదిక పంపాలని కేపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాహుల్‌గాంధీ సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Updated Date - 2023-08-03T13:27:44+05:30 IST