Kumaraswamy: అంతా అబద్ధం
ABN, First Publish Date - 2023-02-02T15:13:58+05:30
కేసీఆర్‌తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్)అధినేత కుమారస్వామి స్పందించారు.
బెంగళూరు: భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( Telangagana CM KCR)తో తనకు గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) అధినేత కుమారస్వామి (Kumaraswamy) కొట్టిపారేశారు. రాజకీయాల్లో తన తండ్రి దేవేగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరేనని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక రాయచూర్‌లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి కుమార స్వామి పాల్గొన్నారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందని కుమార స్వామి చెప్పారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తోందని కుమార స్వామి చెప్పారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కర్ణాటక అభివృద్ధిని వెనక్కు నెట్టాయని కుమార స్వామి ఆరోపించారు.
జనవరి 18న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయ్ విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు, సంఘాల నేతలు తరలివచ్చారు. అయితే కుమారస్వామి హాజరుకాలేదు. దీంతో కేసీఆర్‌కు ఆయనకు చెడిందని ప్రచారం జోరందుకుంది. అయితే ఆ ఆరోపణలన్నీ అబద్ధమని కుమారస్వామి తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ వేళ కుమారస్వామి స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌ను కలుసుకున్నారు.
మరోవైపు ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభం రోజునే అధికార బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు తమిళనాడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్‌తోపాటు మరికొందరు నేతలు హాజరు కానున్నారు. పిబ్రవరి 17 మధ్యాహ్నం సచివాలయ ప్రారంభ కార్యక్రమానికి కూడా వీరంతా హాజరవుతారు. అనంతరం అదేరోజు సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోదీ సభకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌తోపాటు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్, కుమారస్వామి తదితర నేతలు పాల్గొంటారు. సచివాలయ ప్రారంభోత్సవం తర్వాత.. మధ్యాహ్నం, సికింద్రాబాద్‌లో చేపట్టే భారీ బహిరంగ సభలోనూ వీరంతా పాల్గొననున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభకు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నేత బాలమల్లును ఇన్‌చార్జిలుగా నియమించారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిషాల నుంచి ఇప్పటికే పలువురు ప్రముఖ నేతలు అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరగా, మహారాష్ట్రలోనూ భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్ర నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరిగే బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరేందుకు సీనియర్ రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, తదితరులు సభ ఏర్పాట్లు, నిర్వహణ, పార్టీ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ... బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేతలను కలుస్తూ గులాబీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గురువారం మహారాష్ట్రకు చెందిన స్థానిక ప్రజాప్రతినిదులు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. బోకర్ మండలం రాఠీ సర్పంచ్ మల్లేష్ పటేల్ తో సహా 100 మంది మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు బామిని రాజన్న ఆద్వర్యంలో కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
బోకర్ మండలం రాఠీ, నాంద, మాథూడ్, తదితర గ్రామాల్లో పర్యటిస్తూ.... మహిళలు, వృద్దులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిదులను కలుస్తూ.... ఫిబ్రవరి 5న నాందేడ్ లో జరిగే సభకు పెద్దఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - 2023-02-02T15:58:40+05:30 IST