NCP Crisis: ప్రఫుల్ పటేల్‌ను తొలిగించిన శరద్ పవార్
ABN, First Publish Date - 2023-07-03T19:32:44+05:30
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో తలెత్తిన సంక్షోభం రెండోరోజైన సోమవారం కూడా కొనసాగుతోంది. ఎన్‌సీపీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరేలను పార్టీ నుంచి శరద్ పవార్ తొలగించారు. ఇందుకు ప్రతిగా జయంత్ పాటిల్‌కు బదులుగా టట్కరేను పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు అజిత్ వర్గం ప్రకటించింది.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని అడ్డంగా చీల్చి మహారాష్ర్ట ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్ తమదే అసలైన ఎన్‌సీపీ అని ఆదివారంనాడు ప్రకటించుకోవడంతో ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభం రెండోరోజైన సోమవారం కూడా కొనసాగుతోంది. పార్టీని పునర్నిర్మిస్తామని ప్రకటించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తిరుగుబాటు కుట్రలను వివరించేందుకు జనంలోకి వెళ్లారు. తక్షణ చర్యలుగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారానికి హాజరైన ముగ్గురు ఎన్‌సీపీ నేతలను, రహస్య ఫిరాయింపులకు వ్యూహరచన చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా ఎన్‌సీపీ ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ టట్కరేలను పార్టీ నుంచి తొలగించారు. అనర్హత చర్యలు తీసుకోనున్నట్టు తెలియజేస్తూ అజిత్ పవార్, ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 9 మంది పార్టీ ఎంపీలకు లేఖ పంపారు. ఇందుకు ప్రతిగా, మహారాష్ట్ర ఎన్‌సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్‌ను తొలగిస్తున్నట్టు అజిత్ వర్గం ప్రకటించింది. జయంత్ పాటిల్‌కు బదులుగా టట్కరేను పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రఫుట్ పటేల్ ప్రకటించారు. అసెంబ్లీ నేతగా అజిత్ పవార్‌ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, అదే విషయాన్ని స్పీకర్‌కు తెలియజేశామని చెప్పారు. శరద్ పవార్ తమకు గురువని, మనస్ఫూర్తిగా తమను ఆశీర్వదించాలని కోరారు.
అజిత్ వర్గం ఎదురుదాడి..
కాగా, ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారని, తమదే నిజమైన ఎన్‌సీపీ అని తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలంతా తనతోనే ఉన్నందున 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదన్నారు.
విపక్ష నేతగా జితేంద్ర అవ్హాడ్
కాగా, అసెంబ్లీలో విపక్ష నేతగా అజిత్ పవార్ స్థానంలో జితేంద్ర అవ్హాడ్‌ను శరద్ పవార్ ప్రకటించారు. అయితే, జితేంద్ర అవ్హాడ్‌ను విపక్ష నేతగా ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. విపక్ష ఐక్యతకు ఇది విఘాతమని పేర్కొంది. అయితే, పవార్ ఈ విషయాన్ని ఖాతరు చేయకుండా ఎన్‌సీపీ పునర్మిరాణం తక్షణ అవసరమని చెబుతూ మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లారు.
Updated Date - 2023-07-03T19:41:29+05:30 IST