Manish Sisodia arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్
ABN, First Publish Date - 2023-02-26T19:43:14+05:30
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor policy case) అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) కీలక నేత మనీష్ సిసోడియాను (Manish Sisodia) సీబీఐ (CBI) ఆదివారం అరెస్ట్ చేసింది...
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi liquor policy case) అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ (AAP) కీలక నేత మనీష్ సిసోడియాను (Manish Sisodia) సీబీఐ (CBI) ఆదివారం అరెస్ట్ చేసింది. సిసోడియాను దాదాపు 8 గంటలపాటు విచారించిన సీబీఐ రాత్రి 7:30 గంటల సమయంలో అరెస్ట్ చేసింది. రేపు (సోమవారం) ఉదయం సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కాగా అరెస్ట్ సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు అందించారు. ఇక సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వకుండా ఇటు సిసోడియా నివాసంతోపాటు సీబీఐ ప్రధాన కార్యాలయం (CBI Office) పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
లిక్కర్ పాలసీ తయారీలో సిసోడియా కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారనే అభియోగాలు ఉన్నాయి. బ్యూరోక్రాట్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది అరెస్టయ్యారు. ఇప్పటికే రాజేష్‌జోషి, విజయ్‌నాయర్, అమిత్ అరోరా, గౌతమ్, సమీర్‌మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినొయ్‌బాబు, బుచ్చిబాబు అరెస్టయ్యిన విషయం తెలిసిందే.
కాగా గతేడాది నవంబర్‌లో తీసుకొచ్చిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫారసు చేశారు. ఈ కేసులో సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ గతేడాది ఆగస్టులో ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది. దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కేసులో సిసోడియాతోపాటు ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే.
అరెస్ట్‌ను ముందే ఊహించిన సిసోడియా
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆదివారం విచారణకు హాజరువాలంటూ సీబీఐ నోటీసులివ్వడంతో అరెస్ట్ ఖాయమని మనీష్ సిసోడియా ముందే ఊహించారు. విచారణకు హాజరయ్యేముందే ఆదివారం పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం తన నివాసం నుంచి బయల్దేరిన సిసోడియా రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు కూడా నిర్వహించారు. కాగా వారం క్రితమే సిసోడియాను సీబీఐ విచారణకు పిలిచింది. కానీ ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలో తాను తీరిక లేకుండా గడుపుతున్నానని, తనకు మరింత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఆదివారం ఉదయం 11 గంటల్లోగా హాజరుకావాలని సీబీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ‘‘ ఆదివారం ఉదయం నేను సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతాను. ఈ దర్యాప్తునకు నేను సంపూర్ణంగా సహకరిస్తాను. లక్షలాది మంది బాలల ప్రేమాభిమానాలు, కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. కొన్ని నెలలపాటు జైలులో ఉండాల్సి వస్తే నేను పట్టించుకోను’’ అంటూ సిసోడియా ఆదివారం ట్వీట్ కూడా చేశారు. ఇక రాజ్‌ఘాట్ వద్ద మాట్లాడుతూ... తాను భగత్ సింగ్ అనుచరుడినన్నారు. తప్పుడు ఆరోపణలపై జైలుకు వెళ్ళడం తనకు చాలా చిన్న విషయమని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-02-26T20:27:47+05:30 IST