Mann Ki Baat : ఇతరుల మంచి లక్షణాలను ఆరాధిస్తా : ‘మన్ కీ బాత్’లో మోదీ
ABN, First Publish Date - 2023-04-30T11:39:41+05:30
ఇతరులలో ఉన్న మంచి లక్షణాలను ఆరాధించడమే ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) అని తాను భావిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : ఇతరులలో ఉన్న మంచి లక్షణాలను ఆరాధించడమే ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) అని తాను భావిస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. దీనిని వింటున్న ప్రజలే అభినందనలకు అర్హులని చెప్పారు. ఆయన ప్రతి నెలా నిర్వహించే ఈ కార్యక్రమం 100 ఎపిసోడ్‌లో ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మిత్రులారా, నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ అంటే ఇతరులలోని మంచి లక్షణాలను ఆరాధించడమే. నాకు ఓ మార్గదర్శి ఉన్నారు. ఆయన పేరు లక్ష్మణరావు ఇనామ్‌దార్. మేం ఆయనను వకీల్ సాహెబ్ అని పిలిచేవారం. ఇతరులలోని మంచి లక్షణాలను మనం ఆరాధించాలని ఆయన మాకు చెప్తూ ఉండేవారు. మీ సమక్షంలో ఎవరు ఉన్నా సరే, వారు మీ అనుకూలురైనా, ప్రత్యర్థులైనా సరే, వారిలోని మంచి లక్షణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఆయనలోని ఈ లక్షణం నన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తోంది. ఇతరుల మంచి లక్షణాల నుంచి నేర్చుకునే గొప్ప మాధ్యమంగా మన్ కీ బాత్ మారింది’’ అని మోదీ చెప్పారు.
మన్ కీ బాత్ మొదటి ఎపిసోడ్ 2014 అక్టోబరు 3న ప్రారంభమైందని, ఆ రోజు విజయ దశమి అని గుర్తు చేశారు. విజయ దశమి రోజున మనమంతా ‘మన్ కీ బాత్’ ప్రస్థానాన్ని కలిసికట్టుగా ప్రారంభించామన్నారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు జరుపుకునే పండుగ విజయ దశమి అని చెప్పారు. దేశ ప్రజల మంచితనం, సకారాత్మక దృక్పథాల విశిష్ట సంబరంగా ఈ కార్యక్రమం మారిందన్నారు. ఇది ప్రతి నెలా వచ్చే పండుగ అని, దీని కోసం మనమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తామని అన్నారు. దీనిలో మనం పాజిటివిటీని చాటుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అనేక నెలలు, సంవత్సరాలు గడిచాయంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు.
‘మన్ కీ బాత్’ 100 వ ఎపిసోడ్ సందర్భంగా తనకు ప్రజల నుంచి వేలాది ఉత్తరాలు వచ్చాయని, లక్షలాది సందేశాలు వచ్చాయని చెప్పారు. సాధ్యమైనన్ని ఉత్తరాలను చదివానని చెప్పారు. వాటిలోని సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఈ ఉత్తరాలను చదివేటపుడు చాలాసార్లు తాను భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. ఎంతో మానసిక ఉద్వేగానికి గురై, తనను తాను సముదాయించుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రజలు తనను అభినందించారని, అయితే ఈ కార్యక్రమాన్ని వింటున్నవారే అభినందనీయులని తెలిపారు. అభినందనలకు వారే అర్హులని తెలిపారు. ‘మన్ కీ బాత్’ కోట్లాది భారతీయుల మనసులో మాట అని తెలిపారు. వారి మనోభావాల వ్యక్తీకరణ ఈ కార్యక్రమమని వివరించారు.
‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న పీపుల్స్ మాల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజలతోపాటు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొని, మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
ఇవి కూడా చదవండి :
Elections: దేశ చరిత్రలో తొలిసారిగా ఇంటి వద్దకే వెళ్లి..
Mann Ki Baat : ‘మన్ కీ బాత్’పై బిల్ గేట్స్ స్పందన
Updated Date - 2023-04-30T11:52:58+05:30 IST