Mayawati on UCC: యూసీసీకి వ్యతిరేకం కాదు..కానీ..!
ABN, First Publish Date - 2023-07-02T14:03:11+05:30
ఉమ్మడి పౌర స్మృతికి బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి మద్దతు తెలిపారు. భారతీయులందరినీ యూసీసీ కలిపి ఉంచుతుందని అన్నారు. అయితే బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు.
లక్నో: ఉమ్మడి పౌర స్మృతికి (UCC) బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సుప్రీం మాయావతి (Mayawati) మద్దతు (Supports) తెలిపారు. భారతీయులందరినీ యూసీసీ కలిపి ఉంచుతుందని అన్నారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో మాయావతి మాట్లాడుతూ, యూసీసీ అమలు వల్ల భారత్‌కు బలం చేకూరుతుందని, ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందిస్తుందని చెప్పారు. అయితే, బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని ఆమె తప్పుపట్టారు.
''యూసీసీ అమలుకు మా పార్టీ వ్యతిరేకం కాదు. అయితే యూసీసీ అమలు చేయడం కోసం బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి మేము మద్దతివ్వం. ఈ అంశాన్ని రాజకీయం చేసి, బలవంతంగా దేశంలో యూసీసీ అమలు చేయాలని బీజేపీ అనుకుంటోంది'' అని మాయావతి తప్పుపట్టారు. యూసీసీ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల సమస్యలు వస్తాయని, నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చుక్కలనంటుతున్న ధరలు, నిరుద్యోగిత, విద్య, ఆరోగ్యవసతులపై దృష్టి సారించాలని సూచించారు.
ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెరపైకి తీసుకువచ్చారు. రెండు చట్టాల వల్ల దేశం ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. ముస్లిం వర్గాన్ని తప్పుదారి పట్టించి, రెచ్చగొట్టేందుకు యూసీసీ అంశాన్ని విపక్షాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. కాగా, యూసీసీ అమలు చేయడానికి ఇదే తగిన తరుణమని, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ ఈ పని చేయలేమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి స్పష్టం చేశారు. యూసీసీతోనే సమానత్వం, సమన్యాయం సాధ్యమవుతుందని చెప్పారు. ఏడు దశాబ్దాలుగా మతతత్వ కుట్రదారుల చెరలో ఉన్న యూసీసీకి విముక్తి కల్పించాలని యావద్దేశం ఎదురుచూస్తోందని అన్నారు. మరోవైపు, యూసీసీపై అభిప్రాయాలు చెప్పేందుకు ఈనెల 3న తమ ముందు హాజరుకావాలని లా కమిషన్ ప్రతినిధులు, న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులను పార్లమెంటరీ స్టాటింగ్ కమిటీ ఆదేశించింది.
Updated Date - 2023-07-02T14:28:47+05:30 IST