MK Stalin: గెలుపోటములను సమానంగా భావించే తత్త్వం మాది..
ABN, First Publish Date - 2023-03-12T09:19:17+05:30
రాష్ట్రంలో సీఎం కావాలనే దురాశతో పార్టీలు ప్రారంభించిన నాయకులంతా పత్తా లేకుండా పోయారని, అధికారంలో ఉన్నా లేకపోయినా ...
చెన్నై: రాష్ట్రంలో సీఎం కావాలనే దురాశతో పార్టీలు ప్రారంభించిన నాయకులంతా పత్తా లేకుండా పోయారని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడు అండగా ఉండేది డీఎంకే మాత్రమేనని ప్రజలు తమపై నమ్మకం పెంచుకున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరు చిన్నియంపాళయంలో శనివారం ఉదయం ఏర్పాటైన భారీ బహిరంగ సభలో ఇతర పార్టీలకు చెందిన సుమారు పదివేలమంది డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ... మాజీ ముఖ్యమంత్రి, దివంగత అన్నాదురై డీఎంకేని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ పేద, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకే పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారని, అధికారం కోసం కాదని స్పష్టం చేశారని గుర్తు చేశారు.
అన్నాదురై, కరుణానిధి ముఖ్యమంత్రులుగా రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని, వారి అడుగుజాడలలోనే తాను నడుస్తున్నానని చెప్పారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయని, వాటిలో దేశ చరిత్రలో స్థానం సంపాదించుకున్న పార్టీలున్నాయని, పుట్టగొడుగుల్లా ప్రారంభించిన పార్టీలన్నీ అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఇక ఆ పార్టీల నాయకులంతా సీఎం పదవిపై దురాశతో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నించి ఓటమి పాలయ్యాయని స్టాలిన్ ఎద్దేవా చేశారు. కొంతమంది నాయకులు కాబోయే సీఎం తానే అంటూ గొప్పలు చెప్పుకుని చతికిలబడ్డారని చెప్పారు. డీఎంకే రాజకీయ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను చవి చూసిందని, లక్ష్యానికి కట్టుబడి ఉండటంతో పలుమార్లు అధికారాన్ని అర్ధంతరంగా కోల్పోయిందన్నారు.
1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించిన కారణంగా కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేశారని, ఆ తర్వాత ఎల్‌టీటీఈతో సంబంధాల కుంటిసాకుతో మరోమారు ప్రభుత్వాన్ని కూల్చారన్నారు. ప్రస్తుతం ఆరోసారి డీఎంకే అధికారంలోకి వచ్చిందన్నారు. తమిళ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే డీఎంకేలా పలుమార్లు గెలిచిన పార్టీలేవీ లేవన్నారు. అదే విధంగా డీఎంకేలాగా చిత్తుగా ఓటమిపాలై మళ్ళీ గెలిచిన పార్టీలూ లేవన్నారు. గెలుపోటములను సమానంగా భావించే తత్త్వం తమదని, ప్రజలు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయాని అండగా ఉంటామన్నారు.
ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల్లో 80 శాతం నెరవేర్చామని, మిగిలినవి యేడాదిలోపు అందిస్తామన్నారు. ఇటీవల ఈ రోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించడం డీఎంకే పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం మతం పేరుతో, కులం పేరుతో ఘర్షణలు రేకెత్తించి డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇక లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులంతా దృష్టిసారించాలని, పుదుచ్చేరి సహా 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో డీఎంకే కూటమిని గెలిపించేందుకుజిల్లా శాఖ నాయకులు వ్యూహ రచన లు రూపొందించుకోవాలన్నారు. పార్టీ శ్రేణులంతా డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచా రం చేసి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ సభకు మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షత వహించారు. మంత్రులు ముత్తుసామి, గాంధీ,వెల్లకోవిల్ సామినాథన్, కయల్‌విళి సెల్వరాజ్, జిల్లా శాఖ కార్యదర్శి కొండాముత్తూరు రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-12T09:19:17+05:30 IST