Modi ji thali : మోదీ అమెరికా పర్యటన.. ‘మోదీజీ థాలీ’ని ప్రారంభించిన అమెరికన్ రెస్టారెంట్..
ABN, First Publish Date - 2023-06-12T09:21:43+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు
వాషింగ్టన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) త్వరలో అమెరికాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఓ రెస్టారెంట్ ప్రత్యేకంగా ‘మోదీజీ థాలీ’ పేరుతో ఓ థాలీని తయారు చేసింది. దీని యజమాని, ప్రముఖ చెఫ్ శ్రీపాద్ కుల్‌కర్ణి దీనిని తయారు చేశారు. దీనిలో కిచిడి, రసగుల్లా, సర్సోన్ కా సాగ్, కశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్, మరికొన్ని ఇతర తినుబండారాలు ఉన్నాయి.
శ్రీపాద్ కుల్‌కర్ణి మాట్లాడుతూ, భారతీయ మూలాలుగలవారి కోరిక మేరకు ఈ థాలీని తయారు చేసినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) గౌరవార్థం మరో థాలీని తయారు చేయబోతున్నట్లు తెలిపారు. ఇండియన్ అమెరికన్ల మనసులో జైశంకర్ రాక్‌స్టార్ అన్నారు. దీనికి ‘డాక్టర్ జైశంకర్ థాలీ’ అని పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మోదీజీ థాలీని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీనికి మంచి ప్రజాదరణ లభిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.
చూడగానే నోరూరిపోయే విధంగా మోదీజీ థాలీ ఉంది. దీనిలోని పదార్థాలు వర్ణరంజితంగా, అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కిచిడి, రసగుల్లా, సర్సోన్ కా సాగ్, కశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్, మరికొన్ని ఇతర తినుబండారాలు ఉన్నాయి. వీటిలో దేనిని ముందు తినాలో తెలియనంత ఆత్రుత కలిగించే విధంగా కనిపిస్తున్నాయి.
భారత ప్రభుత్వం 2019లో సిఫారసు చేసిన మేరకు ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ థాలీని తయారు చేశారు.
మోదీకి ఈ నెల 22న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యం ఇవ్వబోతున్నారు. మోదీ గౌరవార్థం వీరు విందు ఇవ్వబోతున్నారు. అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రెండోసారి ప్రసంగించిన భారతీయ ప్రధాన మంత్రిగా మోదీ రికార్డు సృష్టించబోతున్నారు.
మోదీ పేరుతో థాలీలు చాలా ఉన్నాయి. గత ఏడాది ఆయన పుట్టిన రోజు (సెప్టెంబరు 17)కు ముందు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఓ రెస్టారెంట్ ‘56 ఇంచ్ నరేంద్ర మోదీ థాలీ’ని తయారు చేసింది. దీనిలో 56 రకాల తినుబండారాలను ఉంచారు. శాకాహారం థాలీ, మాంసాహారం థాలీ వేర్వేరుగా ఉన్నాయి.
ఇదిలావుండగా, మోదీకి ఘన స్వాగతం పలికేందుకు భారతీయ మూలాలుగల అమెరికన్లు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 18న అమెరికాలోని 20 ప్రధాన నగరాల్లో ‘ఇండియా యూనిటీ డే’ మార్చ్‌ను నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న మోదీ న్యూయార్క్‌లోని ఐక్య రాజ్య సమితి సముదాయంలోని నార్త్ లాన్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో అత్యున్నత స్థాయి ఇండియన్-అమెరికన్లు పాల్గొంటారు.
జూన్ 22న వైట్ హౌస్ సౌత్ లాన్స్ వద్ద 21 గన్ శాల్యూట్ మధ్య మోదీకి బైడెన్ దంపతులు స్వాగతం పలుకుతారు. ఈ కార్యక్రమంలో దాదాపు 7 వేల మంది ఇండియన్-అమెరికన్లు పాల్గొంటారని అంచనా.
అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీల అధిపతులను ఉద్దేశించి మోదీ మాట్లాడతారు. ఈ కార్యక్రమం వాషింగ్టన్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్‌లో జరుగుతుంది. అదేవిధంగా రోనాల్డ్ రీగన్ సెంటర్లో భారతీయ మూలాలుగలవారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఇవి కూడా చదవండి :
Apsara Case : అప్సర హత్య తర్వాత సంచలన విషయాలు వెల్లడిస్తూ ఆమె అత్త ఆడియో విడుదల
Amit Shah : తమిళుడిని ప్రధాని చేద్దాం
Updated Date - 2023-06-12T09:21:43+05:30 IST