2024 Lok Sabha Elections : మోదీ సంచలన నిర్ణయం.. తమిళనాడు నుంచి పోటీ?..
ABN, First Publish Date - 2023-07-07T10:03:26+05:30
దక్షిణాదిలో విస్తరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేత పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం ఇటీవల కాశీ-తమిళ సంగమం, కాశీ-తెలుగు సంగమం వంటి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ : దక్షిణాదిలో విస్తరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చేత పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రభుత్వం ఇటీవల కాశీ-తమిళ సంగమం, కాశీ-తెలుగు సంగమం వంటి కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది మధ్య సామరస్యం, పరస్పర అవగాహన పెరిగేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడినట్లు బీజేపీ భావిస్తోంది.
‘మిషన్ సౌత్’ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ఓ నియోజకవర్గం నుంచి మోదీ చేత పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. మోదీ వారణాసితోపాటు తమిళనాడు నుంచి కూడా పోటీ చేస్తే ఆశ్చర్యపోవలసిందేమీ లేదని తెలిపింది. కొన్ని నెలల క్రితం నిర్వహించిన కాశీ-తమిళ సంగమం కార్యక్రమం వల్ల తమిళనాడుతో ఆయన అనుబంధం బలపడిందని కొందరు విశ్లేషకులు చెప్తున్నట్లు తెలిపింది. మోదీ వారణాసితోపాటు కన్యాకుమారి నుంచి పోటీ చేస్తే, ఈ రెండు సుప్రసిద్ద పుణ్యక్షేత్రాల సాంస్కృతిక అనుబంధం మోదీ విజయానికి దోహదపడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారని తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థాయికి వారణాసితోపాటు కన్యాకుమారి నుంచి పోటీ చేస్తే చాలా బాగుంటుందని మరికొందరు చెప్తున్నారు. ఆయన కన్యాకుమారికి బదులుగా కోయంబత్తూరును ఎంపిక చేసుకోవచ్చునని మరికొందరు చెప్తున్నారు.
కన్యాకుమారిలో బీజేపీ సాధారణంగా పటిష్టంగానే ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. దక్షిణ కోయంబత్తూరు శాసన సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ గెలిచారు.
కాశీ-తమిళ సంగమం
భారత దేశాన్ని ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో కాశీ-తమిళ సంగమాన్ని నిర్వహించారు. ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల్లో ఒకటి. గత ఏడాది నవంబరులో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తూ, కాశీ భారత దేశానికి సాంస్కృతిక రాజధాని అని, తమిళనాడు, తమిళ సంస్కృతి భారత దేశ ప్రాచీనత, కీర్తి, ప్రతిష్ఠలకు కేంద్రమని తెలిపారు. భారత దేశం సమైక్య దేశమనే సందేశాన్ని ఇచ్చే అనేక అంశాలు కాశీ, తమిళనాడులలో ఉన్నట్లు తెలిపారు. ఈ సంప్రదాయాలు, వారసత్వం బలంగా పెనవేసుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన యువత, విద్యావంతులు, సామాన్యులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
CM Stalin: ప్రధాని మోదీపై సీఎం స్టాలిన్ ఫైర్.. విమర్శిస్తే సీబీఐ, ఈడీతో బెదిరింపులా..
Updated Date - 2023-07-07T10:03:26+05:30 IST