Jawan: లండన్‌లో జవాన్‌కు ఊహించని చిక్కులు.. డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్.. అసలేం జరిగిందంటే?
ABN, First Publish Date - 2023-09-12T20:58:42+05:30
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మోత మోగిస్తోందో అందరికీ తెలుసు. గత రికార్డుల బూజును దులిపేస్తూ.. కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. షారుఖ్ అభిమానులైతే..
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మోత మోగిస్తోందో అందరికీ తెలుసు. గత రికార్డుల బూజును దులిపేస్తూ.. కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. షారుఖ్ అభిమానులైతే ఈ సినిమాని రిపీటెడ్‌గా చూస్తున్నారు. మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో షారుఖ్ ఇరగదీయడంతో.. సినీ ప్రియులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. ఫలితంగా.. ఇది బాలీవుడ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లోనే ఇది బ్లాక్‌బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయిందంటే, ఆడియెన్స్‌ని ఇది ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి ‘జవాన్’ సినిమాకు తాజాగా ఊహించని చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లిన అభిమానులు.. సగంలోనే బయటకు వచ్చేసి, తమకు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. అయితే.. ఇందుకు ఒక బలమైన కారణం కూడా ఉందిలెండి. ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు థియేటర్లకు వెళ్లగా.. వారికి చేదు అనుభవం ఎదురైంది. థియేటర్ యాజమాన్యం పొరపాటున ప్రథమార్థం వేయకుండా ద్వితీయార్థాన్ని ప్రదర్శించింది. దీంతో నిరాశచెందిన అభిమానులు.. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై సహార్ రషీద్ అనే ఓ మేకప్ ఆర్టిస్ట్ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో తొలుత భాగస్వామితో కలిసి సినిమా వెళ్లిన దృశ్యాల్ని చూపించింది. చివరికి.. సినిమా తమను ట్రోల్ చేసిందంటూ నిరాశ వ్యక్తం చేసింది.
ఆ వీడియోలో సహార్ మాట్లాడుతూ.. ‘‘థియేటర్ యాజమాన్యం నేరుగా ద్వితీయార్థాన్ని ముందుగా ప్రదర్శించింది. ఒక గంట 10 నిమిషాల్లోనే వీళ్లు సినిమాని ముగించేశారు. ఆ తర్వాత ఇంటర్వెల్ అని చెప్పారు. అప్పుడే మాకు ఓ సందేహం తట్టింది. విలన్ చనిపోయిన తర్వాత ఇంటర్వెల్ రావడమేంటి? అని అనిపించింది. ఆ తర్వాత మాకు అర్థమైంది.. అసలు థియేటర్ వాళ్లు ప్రథమార్థమే వేయలేదు అని’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం టికెట్ విండో దగ్గరకు వెళ్లి.. పూర్తి సినిమా వేయకుండా ప్రథమార్థమే వేసినందుకు, తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా టికెట్ విండో వద్ద క్యూ కట్టారు. తన డ్రీమ్ యాక్టర్ షారుఖ్ సినిమా చూడ్డానికి ఎంతో ఉత్సాహంతో వస్తే.. థియేటర్ వాళ్లు దాన్నంతా నీరుగార్చేశారంటూ సహార్ చివర్లో ఫీల్ అయ్యింది.
Updated Date - 2023-09-12T20:58:42+05:30 IST