Mysoor: మైసూరు ప్యాలెస్‌లో బంగారు సింహాసనం సిద్ధం
ABN, First Publish Date - 2023-10-10T11:50:17+05:30
మైసూరు దసరా ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ఓ వైపు రాజ సంస్థానం మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలతో సంబరాలు
- నాలుగురోజులు సందర్శకులకు నోఎంట్రీ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేకత ఉంది. ఓ వైపు రాజ సంస్థానం మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలతో సంబరాలు ఆడంబరంగా సాగుతాయి. మైసూరు రాజవంశస్థులు నవరాత్రి పూజల్లో భాగంగా అంబా విలాస్ ప్యాలెస్‌లోని దర్బార్ హాల్‌లో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి సోమవారం శ్రీకారం చుట్టారు. రత్నఖచిత బంగారు సింహాసనాన్ని అమర్చారు. ఉదయం 10.05 - 10.30 గంటల శుభవేళ రాజమాత ప్రమోదాదేవి ఒడయార్ నేతృత్వంలో సింహాసనం అమరిక జరిగింది. ఈనెల 15 నుంచి 24 వరకు ప్యాలెస్‌లో రాజ సంప్రదాయానికి అనుగుణంగా యువరాజు యుదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ నవరాత్రి పూజా కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తారు. అందులో భాగంగా ప్యాలెస్ స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన బంగారు సింహాసనం విడిభాగాలను రాజమాత, భద్రతాధికారుల సమక్షంలో తెరిచారు. వాటిని దర్బార్ హాల్‌కు తీసుకొచ్చి అమర్చారు. అంతకుముందు దర్బార్ హాలులో గణపతి హోమం, నవగ్రహ, చండికా హోమాలను నిర్వహించారు. సిం హాసనం అమరిక తర్వాత ప్యాలెస్‌కు పట్టపు ఏనుగు, గుర్రం, ఆవులకు పూజలు నిర్వహించారు. సాయంత్రం సింహాసనానికి విశేషమైన అలంకరణతో పూజించారు. ఈనెల 15న రత్నఖచిత సింహాసనానికి సింహాన్ని అమర్చడం ద్వారా దర్బార్‌కు శ్రీకారం చుడతారు. యువరాజు యదువీర్, సతీమణి రిషికా ఒడయార్ కంకణధారులవుతారు. తద్వారా నవరాత్రి పూజలు జరుగుతాయి. సింహాసనంపై యదువీర్ ప్రైవేట్ దర్బార్‌ను ప్రతిరోజూ నిర్వహిస్తారు. విజయదశమి రోజు సాయంత్రం ప్రైవేట్ దర్బార్ తర్వాత సింహాసనాన్ని విడిభాగాలుగా చేసే ప్రక్రియతో నవరాత్రి పూజలు ముగుస్తాయి.
Updated Date - 2023-10-10T11:50:17+05:30 IST