Modi Vs Congress : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం పేరు మార్పు.. కాంగ్రెస్ ఆగ్రహం..
ABN, First Publish Date - 2023-06-16T11:22:08+05:30
నెహ్రూ మొమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం మరియు సమాజం (Prime Ministers Museum & Society)గా మార్చబోతున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అభద్రతాభావంతో అణగారిపోతున్న సూక్ష్మజీవి అని మండిపడింది.
న్యూఢిల్లీ : నెహ్రూ మొమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) పేరును ప్రధాన మంత్రుల మ్యూజియం మరియు సమాజం (Prime Ministers Museum & Society)గా మార్చబోతున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అభద్రతాభావంతో అణగారిపోతున్న సూక్ష్మజీవి అని మండిపడింది.
కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ (Congress leader Jairam Ramesh) శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక అభద్రతలతో క్రుంగిపోతున్న సూక్ష్మజీవి అని ఆరోపించారు. మన దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు పేరు, ప్రతిష్ఠలు, గొప్ప వారసత్వం ఉన్నాయని చెప్పారు. ఆయన భారత దేశ రూపశిల్సి అని తెలిపారు. ఆయనను గుర్తు చేసుకుంటూ మ్యూజియం అండ్ లైబ్రరీకి ఆయన పేరును పెట్టినట్లు తెలిపారు.
‘‘చిల్లరతనం, కక్షసాధింపు, నీ పేరు మోదీ. 59ఏళ్లకుపైగా పుస్తక భాండాగారంగా, ఆర్కైవ్స్ ఖజానాగా, గ్లోబల్ ఇంటలెక్చువల్ ల్యాండ్‌మార్క్‌గా ఎన్ఎంఎంఎల్ నిలిచింది. దీనిని ఇకపై ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీ అని పిలుస్తారు. భారత దేశ రూపశిల్పి యొక్క పేరు, ఔన్నత్యాలను చెరిపేయడానికి, చులకన చేయడానికి, నాశనం చేయడానికి మోదీ చేయని పని అంటూ ఏదీ లేదు’’ అని జైరామ్ రమేశ్ ఆరోపించారు. అభద్రతాభావంతో క్రుంగిపోతున్న సూక్ష్మ జీవి స్వయం ప్రకటిత విశ్వగురువు’’ అని మోదీని జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు. జైరామ్ రమేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్ల విభాగం), రాజ్యసభ సభ్యుడు. తాను నెహ్రూవాదినని ఆయన చెప్పుకుంటారు.
నెహ్రూ మొమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ సమావేశం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన గురువారం జరిగినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ సమావేశంలో దీని పేరును ప్రధానమంత్రుల మ్యూజియం అండ్ సొసైటీగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్ఎంఎంఎల్ సొసైటీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడు, రాజ్‌నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడు. కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్, జీ కిషన్ రెడ్డి, నిర్మల సీతారామన్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఢిల్లీలోని తీన్ మూర్తి క్యాంపస్‌లో ఎన్ఎంఎంఎల్ ఉంది. ఇక్కడ ఆధునిక, సమకాలిక భారత దేశంపై పరిశోధనలు జరుగుతాయి. 1964 నవంబరు 14న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దీనిని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి :
Reservation fight : మణిపూర్ మంటల వెనుక.. మీటీ, కుకీ తెగల మధ్య రిజర్వేషన్ పోరు
Manipur : మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి, దహనం..
Updated Date - 2023-06-16T11:37:26+05:30 IST