Kharif Crops : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!
ABN, First Publish Date - 2023-06-07T15:39:20+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచారు. వరి క్వింటాలుకు రూ.143 చొప్పున, మూంగ్ దాల్ క్వింటాలుకు రూ.803 చొప్పున, రాగులు క్వింటాలుకు రూ.268 చొప్పున పెంచారు.
మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Union Minister Piyush Goyal) మీడియాకు వివరించారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర (MSP)ను పెంచినట్లు తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు, రైతులకు సరసమైన ధర లభించేలా చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎంఎస్‌పీని రికార్డు స్థాయిలో పెంచినట్లు తెలిపారు. వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.2,040 నుంచి రూ.2,183కు పెంచినట్లు తెలిపారు. మూంగ్ దాల్ ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచారు. మణిపూర్ హింసాకాండ, బాలాసోర్ రైలు దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారికి మంత్రివర్గం సంతాపం తెలిపిందని గోయల్ తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎంఎస్‌పీ ధరలు
- సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో రూ.2,040 ఉండేది. దీనిని 2023-24 కోసం రూ.2,183కు పెంచారు. అంటే రూ.143 పెంచారు.
- గ్రేడ్ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,060 నుంచి రూ.143 పెంచి, రూ.2,203 చేశారు.
- హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని రూ.2,970 నుంచి రూ.210 పెంచి, రూ.3,180 చేశారు.
- రాగులు (చోళ్లు) క్వింటాలుకు రూ.3,578 నుంచి రూ.3,846కు పెంచారు. అంటే రూ.268 పెరిగింది.
- వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు రూ.527 పెంచి, రూ.6,377 చేశారు. అంతకుముందు ఇది రూ.5,850 ఉండేది.
ఎంఎస్‌పీ అంటే..
రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించే ధరను కనీస మద్దతు ధర అంటారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఖరీఫ్ (యాసంగి) పంటలను కోసిన తర్వాత అక్టోబరు నుంచి రబీ (శీతాకాలం) పంట కాలం ప్రారంభమవుతుంది. గోధుమలు, ఆవాలు ప్రధాన రబీ పంటలు.
ఇవి కూడా చదవండి :
Odisha Train Accident : డబ్బు కోసం ఇంత దారుణమా? ఒడిశా రైలు ప్రమాద మృతుల శవాలతో మోసాలు!
Air India plane : మగడాన్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయులు.. ఇది బంగారు నిక్షేపాలున్న పట్టణం!..
Updated Date - 2023-06-07T15:47:27+05:30 IST