Vande Bharat Train : రైల్వే మంత్రి సంచలన ప్రకటన
ABN, First Publish Date - 2023-01-29T16:09:14+05:30
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలులో పరిశుభ్రత కొరవడిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు
న్యూఢిల్లీ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలులో పరిశుభ్రత కొరవడిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు రావడంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) స్పందించారు. ఈ రైళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని రైల్వే కార్మికులను ఆదేశించారు. ప్రయాణికులు చెత్త బుట్టలో కాకుండా ఇతర ప్రదేశాల్లో చెత్తను వేయకుండా చూసేందుకు కూడా నూతన క్లీనింగ్ విధానాన్ని సూచించారు.
విమానాల్లో చెత్త వేయకుండా నిరోధించే విధానాన్ని వందే భారత్ రైళ్లలో కూడా ఉపయోగించాలని ఆదేశించారు. కార్మికులు పెద్ద పెద్ద సంచులను నేరుగా ప్రయాణికుల వద్దకు తీసుకెళ్లి చెత్తను సేకరించాలని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ విధానానికి సహకరించాలని ప్రజలను కోరారు.
అంతకుముందు అవనీష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ఇచ్చిన ట్వీట్‌లో, వందే భారత్ రైలులో చెత్త పోగుపడి ఉండటాన్ని ప్రస్తావించారు. దీనిపై చాలా మంది స్పందిస్తూ, ప్రయాణికులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో ప్రజలకు తమ కర్తవ్యం గురించి తెలియదు కానీ, తమ హక్కుల గురించి తెలుసునని కొందరు పేర్కొన్నారు. పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రజలు తమ వంతు కృషి చేయాలని హితవు పలికారు.
ప్రభుత్వం నుంచి మరిన్ని సేవలు, పరిశుభ్రత కోరుకునే ముందు ప్రజలు పరిశుభ్రంగా ఉంచడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని, శుభ్రంగా ఉంచడం ఎలాగో తెలుసుకోవాలని మరికొందరు తెలిపారు. మెరుగైన సదుపాయాలు, మంచి మౌలిక సదుపాయాలను మనం కోరుకుంటూనే ఉంటామని, కానీ మన దేశంలో ప్రజలకు పరిశుభ్రంగా ఉంచడం ఎలాగో తెలియదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి తెలియదని మరికొందరు వాపోయారు.
Updated Date - 2023-01-29T16:09:18+05:30 IST