New terminal: కొత్త టెర్మినల్‌లో విమానాల నైట్ ల్యాండింగ్ టెస్ట్
ABN, First Publish Date - 2023-05-09T07:15:02+05:30
అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport)లో కొత్తగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రెండో టెర్మినల్‌లో
అడయార్(చెన్నై): చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం(Chennai International Airport)లో కొత్తగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రెండో టెర్మినల్‌లో సేవలు ఇటీవల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కేవలం పగటిపూట మాత్రమే ఈ టెర్మినల్‌లో విమానాలు ల్యాండవుతున్నాయి. ఇపుడు రాత్రిపూట కూడా విమానాలు విజయవంతంగా దిగేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం విమానాలు రాత్రి పూట, వేకువజామున టేకాన్, టేకాఫ్ పరీక్షలు ప్రారంభించారు. ఈ టెస్టుల్లో భాగంగా సోమవారం వేకువజామున 1.15 గంటల సమయంలో కువైట్(Kuwait) నుంచి చెన్నైకు వచ్చిన విమానాన్ని విజయవంతంగా ల్యాండింగ్(Landing) చేయించారు. ఇదే విమానం మళ్ళీ తెల్లవారుజామున 3.30 గంటలకు కువైట్‌కు బయలుదేరి వెళ్ళింది. ఈ ప్రయోగ పరీక్షలు ఈనెల మూడోవారం వరకు నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని రకాల టెస్టులు పూర్తిచేసి, జూన్ మొదటి వారం నుంచి కొత్త టెర్మినల్‌లో అన్ని రకాల సేవలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలన్న ఆలోచనలో ఎయిర్‌పోర్టు అధికారులు ఉన్నారు. ఈ టెర్మినల్ నుంచే వచ్చిపోయే విమాన రాకపోకలను కొనసాగిస్తామని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా, మొత్తం 1,36,295 చదరపుటడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్‌ను గత నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి, జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ టెర్మినల్‌లో ప్రయాణికుల భద్రత కోసం 100 కౌంటర్లు, 108 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ఆరు కన్వేయర్ బెల్టులు, 17 అత్యాధునిక లిఫ్టులు, 17 ఎస్కలేటర్లు, ఆరు వాక్‌లేటర్లు, ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసేందుకు అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు ఇలా అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ టెర్మినల్‌లో గత నెల 25వ తేదీన తొలి ల్యాండింగ్ టెస్ట్ ప్రారంభించారు. ఈ నెల మూడో తేదీన మరికొన్ని విమానాల ల్యాండింగ్ టెస్టులు చేశారు. అలాగే చిన్న తరహా విమానాలైన ఎయిర్‌బస్ 320, 321, భారీ ఎయిర్ బస్ 737, 738లు కూడా ఈ టెర్మినల్‌లో విజయవంతంగా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యాయి.
Updated Date - 2023-05-09T07:15:02+05:30 IST