Kerala train fire Case : కేరళ రైలులో ప్రయాణికులకు నిప్పు అంటించిన కేసు దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత
ABN, First Publish Date - 2023-04-18T18:42:04+05:30
కేరళలోని కొజిక్కోడ్ స్టేషన్ సమీపంలో అళప్పుజ-కన్నూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ దుండగుడి దుశ్చర్యకు సంబంధించిన కేసు
తిరువనంతపురం : కేరళలోని కొజిక్కోడ్ స్టేషన్ సమీపంలో అళప్పుజ-కన్నూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ దుండగుడి దుశ్చర్యకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) స్వీకరించింది. ఏప్రిల్ 2న ఈ రైలులో ప్రయాణించిన షారుఖ్ సైఫీ తన తోటి ప్రయాణికులపై పెట్రోలు జల్లి, నిప్పు అంటించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఇప్పటి వరకు కేరళ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు చేసింది. ఇక నుంచి కొచ్చిలోని ఎన్ఐఏ యూనిట్ దర్యాప్తు జరుపుతుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అళప్పుజ-కన్నూరు ఇండర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏప్రిల్ 2న కొజిక్కోడ్ స్టేషన్ నుంచి బయల్దేరింది. ఆ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో ఢిల్లీకి చెందిన షారూఖ్ సైఫీ తన తోటి ప్రయాణికులపై పెట్రోలు జల్లి, నిప్పు అంటించాడు. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ముగ్గురు ప్రయాణికులు క్రిందికి దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి కాలిన గాయాలు అయ్యాయి. గాయపడినవారిలో సైఫీ కూడా ఉన్నాడు. సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఏప్రిల్ 5న పట్టుకున్నారు. కేరళ పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల సమాచారం మేరకు మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ సైఫీని అరెస్ట్ చేసింది. అనంతరం అతనిని కేరళకు తీసుకొచ్చారు. అతని పోలీస్ కస్టడీ బుధవారంతో ముగుస్తుంది. అనంతరం అతనిని త్రిసూర్ కేంద్ర కారాగారానికి పంపిస్తారు. అతను బెయిలు కోసం చేసిన దరఖాస్తుపై కొజిక్కోడ్ జిల్లా కోర్టు ఏప్రిల్ 20న విచారణ జరుపుతుంది.
సిట్ తెలిపిన వివరాల ప్రకారం, సైఫీ తన తండ్రితో కలిసి ఢిల్లీలో కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. వివాదాస్పద ముస్లిం బోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలతో తీవ్ర స్థాయిలో రాడికలైజ్ అయ్యాడు. ఆయన ఫోన్‌లో ఈ ప్రసంగాలను గుర్తించారు. కేరళ పోలీసులు అతనిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఉగ్రవాద కోణంగల కేసులను దర్యాప్తు చేయడం పోలీసులకు సాధ్యం కాదు కాబట్టి దీనిని ఎన్ఐఏకు అప్పగించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసు దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకు అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
Supreme Court : అతిక్-అష్రఫ్ హత్యలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
Mukul Roy : టీఎంసీ కీలక నేత ముకుల్ రాయ్ ఆచూకీ తెలిసింది
Updated Date - 2023-04-18T18:42:04+05:30 IST