Adani Group : అదానీ గ్రూప్ వ్యవహారంపై నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-04T19:06:22+05:30
దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రం
ముంబై : దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న అదానీ గ్రూప్ వ్యవహారం ప్రభావం భారత దేశ ఆర్థిక భావ చిత్రం (Image)పైనా, స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలపైనా ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) స్పష్టం చేశారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు (FPOs) వస్తూ ఉంటాయని, విదేశీ సంస్థాగత మదుపరులు (FIIs) వెళ్లిపోతూ ఉంటారని చెప్పారు. అదానీ గ్రూప్ ఎఫ్‌పీఓను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆమె ముంబైలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మన దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలు కానీ, మన ఆర్థిక వ్యవస్థ భావ చిత్రం (image) కానీ ఏ విధంగానూ ప్రభావితం కాలేదన్నారు. గడచిన రెండు రోజుల్లో 8 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం వచ్చిందన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల గురించి అడిగినపుడు నిర్మల బదులిస్తూ, ఈ విషయాన్ని మన దేశ స్వతంత్ర ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు పరిశీలిస్తాయన్నారు. మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడగలిగే అధికారం, వనరులు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి ఉన్నట్లు తెలిపారు. ప్రతి మార్కెట్లోనూ హెచ్చతగ్గులు, ఒడుదొడుకులు ఉంటాయన్నారు. అయితే గత కొన్ని రోజుల్లో క్రమంగా కనిపిస్తున్న వృద్ధి వల్ల భారత దేశంతోపాటు, దేశంలోని అంతర్గత బలాలపట్ల మన్నన సుస్థిరంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఇప్పటికే దీనిపై స్పందించిందని తెలిపారు. అంతకుముందే బ్యాంకులు, ఎల్ఐసీ తమంతట తామే వచ్చి, సమాచారాన్ని తెలిపాయన్నారు. నియంత్రణ వ్యవస్థలు తమ పని తాము చేస్తాయన్నారు. ఈ నియంత్రణ వ్యవస్థలు స్వతంత్రంగా పని చేస్తాయని చెప్పారు. ప్రైమ్ కండిషన్‌లో మార్కెట్లను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలు అవి తీసుకుంటాయన్నారు.
అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ సంపద భారీగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. అయినప్పటికీ ఈ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు సగానికి తగ్గిపోయింది. మొత్తం మీద 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓను బుధవారం ఉపసంహరించుకుంది.
Updated Date - 2023-02-04T19:06:26+05:30 IST