Karnataka Elections 2023: సిద్ధరామయ్యతో విజయేంద్ర పోటీపై యడియూరప్ప క్లారిటీ..!
ABN, First Publish Date - 2023-03-31T19:58:51+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) నగారా మోగడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇటీవల విడుద చేసిన జాబితాలో మాజీ సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) వరుణ (Varuna) నియోజకవర్గం కేటాయించింది. చాలాకాలంగా ఈ నియోజకవర్గానికి సిద్ధరామ్యయ ప్రాతినిధ్యం వహించగా, గత పర్యాయం ఆయన తన కుమారుడికి వరుణ నియోజకవర్గం అప్పగించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి తిరిగి సిద్ధరామయ్య బరిలో ఉన్నారు. దీంతో ఆయనకు పోటీగా బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) కుమారుడైన బీవై విజయేంద్రను (Vijayendra)ను కమలనాథులు బరిలోకి దింపనున్నట్టు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, తాజాగా ఈ ఊహాగానాలను యడియూరప్ప కొట్టివేశారు. షికారిపుర (Shikaripura) నుంచి తన కుమారుడు విజయేంద్ర పోటీ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
యడియూరప్ప శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, విజయేంద్రను వరుణ నియోజకవర్గం నుంచి పోటీలోకి దింపాలనే ఒత్తిడి ఉందని, అయితే ఆయన షికారిపుర నుంచే పోటీ చేస్తారని చెప్పారు. కారణాలేలు ఏవైనప్పటికీ... వరుణ నియోజకవర్గం నుంచి విజయేంద్ర పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని విజయేంద్ర ఇటీవల చెప్పిన విషయాన్ని మీడియా ప్రస్తావించగా, విజయేంద్ర చెప్పిన మాట నిజమేనని, కానీ ఆయన షికారిపుర నుంచే పోటీ చేస్తారని, ఈ విషయాన్ని తానను పార్టీ అధిష్ఠానానికి, విజయేంద్రకు తెలియజేస్తానని యడియూరప్ప సమాధానమిచ్చారు. వరుణ (సిద్ధరామయ్య సొంత నియోజకవర్గం) నుంచి పోటీ చేసే ప్రసక్తి మాత్రం ఉండదని చెప్పారు. ప్రస్తుతం షికారిపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న యడియూరప్ప ఇటీవలనే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరుగనున్నాయి.
Updated Date - 2023-03-31T19:59:46+05:30 IST