గడ్కరీపై సుప్రియ వ్యాఖ్యల అంతరార్థమేమిటి?
ABN, First Publish Date - 2023-02-15T17:50:17+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో 78 మంత్రులు ఉంటే, ఇందులో 31 మంది కేబినెట్ హోదాలో, తక్కిన వారు సహాయ మంత్రుల హోదాలో ఉన్నారు. ఏ శాఖకు ఎందరు మంత్రులు, సహాయ మంత్రులు ఉన్నా మోదీ..
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో 78 మంత్రులు ఉంటే, ఇందులో 31 మంది కేబినెట్ హోదాలో, తక్కిన వారు సహాయ మంత్రుల హోదాలో ఉన్నారు. ఏ శాఖకు ఎందరు మంత్రులు, సహాయ మంత్రులు ఉన్నా మోదీ కనుసన్నల్లోనే నిర్ణయాలు జరుగుతుంటాయనే ప్రచారం ఉంది. మంత్రుల పనితీరుపై ప్రధాని ఎప్పటికప్పుడు రిపోర్ట్ రాబడుతుంటారు. అవసరమని అనుకున్నప్పుడు మంత్రివర్గ పునవర్వస్థీకరణ చేస్తుంటారు. హోంమంత్రితో సహా కేంద్ర నేతలు ఎప్పుడు, ఎక్కడ ప్రసంగాలు చేసినా మోదీ ప్రస్తావన చేయని సందర్భం ఒక్కటీ కనిపించదు. ఇందుకు అనుగుణంగానే ఆయా నేతలు తగిన రివార్డులు (పదవులు) పొందుతుంటారని చెబుతుంటారు. అయితే, మోదీకి దన్నుగా నిలిచే ఇందరు మంత్రులు ఉన్నా నిబద్ధతతో పనిచేసే మంత్రులు ఒక్కరూ లేరా? సీనియర్ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) మాత్రమే పనిచేస్తు్న్నారా? అవునంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తాజాగా చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. దీనిపై చర్చ సైతం మొదలైంది. మోదీ మంత్రివర్గంలో గడ్కరి మాత్రమే పనిచేస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించడం వెనుక ఉద్దేశం ఏమిటి? గడ్కరి బయటకు వచ్చేస్తారా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు మీద నీలి నీడలు కమ్ముకున్నాయా? ఆ విషయం ముందే సుప్రియా గ్రహించారా? అనే ప్రశ్నలు రాజకీయ తెరపై తలెత్తుతున్నాయి.
సుప్రియ ఏమన్నారు?
సెంట్రల్ మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో మంగళవారం ఎన్‌సీపీ సమావేశం జరిగింది. సుప్రియా సూలే తన ప్రసంగంలో నితిన్ గడ్కరిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత (కేంద్ర) ప్రభుత్వంలోని మంత్రుల్లో ఒక్క నితిన్ గడ్కరి మాత్రమే పనిచేస్తున్నారని తెగిసే చెప్పారు. తన మాటలు అండర్‌లైన్ చేసుకోవచ్చన్నారు. గడ్కరి మంత్రిగా పనిచేసేటప్పుడు మిగతా మంత్రుల తరహాలో కాకుండా తమతో ఏ పార్టీలు కలిసి ఉన్నాయి, ఏ పార్టీలు లేవనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. అందర్నీ కలుపుకొని వెళ్తారు...అని ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర పర్భని జిల్లాలోని జాతీయ రహదారిపై ఉన్న ఒక రోడ్డుకు మరమ్మతు చేయించాల్సిందిగా సంబంధింత అధికారులను ఆదేశించాలని కూడా నాగపూర్ ఎంపీ గడ్కరిని ఓ ట్వీట్‌లో సుప్రియ కోరారు.
ప్రధాని ప్రసంగంలో చప్పట్లు కొట్టని ఒకే ఒక్కడు..
నితిన్ గడ్కరికి విపక్ష పార్టీల్లోనూ మంచి మిత్రులున్నారనడంలో ఎవరికీ సందేహం లేదు. రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రిగా ఉన్న ఆయనను గతంలోనూ పలువురు విపక్ష నేతలు ప్రశంసించిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే సుప్రియా సూలే వ్యాఖ్యలు తాజాగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గడ్కరిని ఆమె ప్రశంసించడం వెనుక ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో జరిగిన ఓ సంఘటనను కూడా ఆమె దృష్టిలో పెట్టుకుని ఉండవచ్చని కొందరి అభిప్రాయంగా ఉంది. ఇటీవల జనరల్ బడ్జెట్‌పై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం మోదీ సమాధానం ఇస్తూ, విపక్షాల తీరును ఎండగట్టారు. దేశ ప్రగతికి బీజేపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను ఘనంగా చెప్పుకున్నారు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయన పక్కన, ముందు, వెనుక ఉన్న పార్టీ ఎంపీలు బల్లలు చరుస్తూ, క్లాప్స్ కొడుతూ హడావిడి చేశారు. అయితే ఇందుకు ఒకరు మినహాయింపు. క్లాప్ కొట్టని ఒకే ఒక్కడుగా గడ్కరి నిలిచారు. దీనిని దృష్టిలో ఉంచుకునే సుప్రియా సూలే తాజా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చేనే ఒక అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపు బీజేపీకి నల్లేరు మీద నడక కాకపోవచ్చని, ఆ కారణంగా గడ్కరి బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని సుప్రియ భావిస్తున్నట్టు కనిపిస్తోందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే, ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రమైన నాగపూర్ వెన్నుదన్ను గడ్కరికి మొదట్నించీ బలంగా ఉన్నందున గడ్కరి పార్టీని వీడే అవకాశాలు ఉండకపోవచ్చని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా సుప్రియ వ్యాఖ్యల వెనుక ఇతమిత్ధమైన కారణం తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి.
Updated Date - 2023-02-15T17:53:10+05:30 IST