I.N.D.I.A : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికల’పై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం
ABN, First Publish Date - 2023-09-01T14:53:18+05:30
లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది.
ముంబై : లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వ చర్యలు సమాఖ్య నిర్మాణానికి ముప్పు కలిగిస్తాయని దుయ్యబట్టింది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు ఏకపక్ష నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారని నిలదీసింది.
కాంగ్రెస్, జేడీయూ, ఎన్‌సీపీ-శరద్ పవార్ వర్గం, నేషనల్ కాన్ఫరెన్స్, ఆప్, టీఎంసీ, సహా 28 ప్రతిపక్ష పార్టీల నేతలు ముంబైలో గురు, శుక్రవారాల్లో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ ఇండియా కూటమి నేతల సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనడంపై చర్చించారు. ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లపై నేతలు చర్చించారు. సమన్వయ కమిటీ, ఉప సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఒక దేశం-ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఆలోచనపై ఈ కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల దేశంలోని సమాఖ్య నిర్మాణం దెబ్బతింటుందని ఆరోపించారు. సీపీఐ నేత డీ రాజా మాట్లాడుతూ, భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అంటూ ఉంటారని, ఇతర రాజకీయ పార్టీలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు.
శివసేన -యూబీటీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దేశం ఇప్పటికే ఒకటిగా ఉందని, దీనిని ఎవరూ ప్రశ్నించడం లేదని అన్నారు. దేశంలో ఎన్నికలు న్యాయంగా జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఒక దేశం-ఒకేసారి ఎన్నికలను కోరుకోవడం లేదన్నారు. తమ డిమాండ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఒక దేశం-ఒకేసారి ఎన్నికల అంశాన్ని లేవనెత్తారని దుయ్యబట్టారు.
చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను అభినందిస్తూ ఈ కూటమి ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఇస్రో సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని, ఆ సంస్థలో పని చేసిన, చేస్తున్నవారందరికీ అభినందనలని తెలిపింది. ఇస్రో శక్తి, సామర్థ్యాలను నిర్మించి, విస్తరించి, పటిష్టం చేయడానికి ఆరు దశాబ్దాలు పట్టిందని పేర్కొంది. చంద్రయాన్-3 ప్రపంచాన్ని అబ్బురపరచిందని తెలిపింది. ఆదిత్య ఎల్-1 ప్రయోగం కోసం ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తోందని, ఇస్రో సాధిస్తున్న అసాధారణ విజయాలు సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని బలోపేతం చేస్తాయని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువతకు ప్రేరణగా నిలుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.
ఇండియా కూటమి లోగో గురించి సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఇది చాలా ముఖ్యమైనదని, దీని గురించి సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిని శుక్రవారం విడుదల చేయడం లేదన్నారు.
సమన్వయ కమిటీలో భాగస్వాములయ్యేందుకు ప్రతి పార్టీ ఒక నేత పేరును సూచించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ మాట్లాడుతూ, అక్టోబరు 2నాటికి మేనిఫెస్టోను సిద్ధం చేయాలని కోరారు. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, వచ్చే నెలాఖరునాటికి లోక్ సభ స్థానాల పంపకాలు పూర్తి కావాలన్నారు.
ఈ సమావేశాల్లో పాల్గొన్నవారలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ; ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా; పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత సీతారామ్ ఏచూరి, సీపీఐ నేత డీ రాజా, సీపీఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం కేంద్రం మరో ముందడుగు
Updated Date - 2023-09-01T14:53:18+05:30 IST