Sanjay Raut: ఖర్గే సమావేశానికి గైర్హాజర్ ఎందుకంటే..?.. సంజయ్ రౌత్ క్లారిటీ
ABN, First Publish Date - 2023-03-29T13:11:12+05:30
మహారాష్ట్రలోనూ, జాతీయ స్థాయిలోనూ విపక్షాల ఐక్యతకే తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్..
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోనూ, జాతీయ స్థాయిలోనూ విపక్షాల ఐక్యతకే తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) బుధవారంనాడు చెప్పారు. పార్లమెంటు వద్ద జరుగుతున్న నిరసనలో తాము పాల్గొంటామని అన్నారు. సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై థాకరే వర్గం హెచ్చరికలు చేయడం, మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి గైర్హాజరైన అనంతరం క్రమంలో సంజయ్ రౌత్ తాజా వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు వెళ్తాం..
''రెండ్రోజుల క్రితం మా ఆందోళన (సావర్కర్ అంశంపై) ఏమిటో తెలియజేశాం. ఖర్గే నివాసానికి కూడా వెళ్లలేదు. మహారాష్ట్రలోనూ, దేశంలోనూ విపక్షాల ఐక్యతకు మేము కట్టుబడి ఉన్నాం. మేము వ్యక్తం చేసిన ఆందోళనకు తగిన ఫలితం వచ్చింది. గురువారం విపక్షాల సమావేశానికి హాజరవుతాం. నిరసనల్లోనూ పాల్గొంటాం. విపక్షాల ఐక్యతకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తాం'' అని మీడియాతో మాట్లాడుతూ రౌత్ తెలిపారు.
అదానీ అంశంపై మండిపాటు..
అదానీ అంశం, అవినీతిపై రౌత్ మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేవలం విపక్షాలపైనే ఉపయోగిస్తారా? అదానీపై ఉపయోగించరా? అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లేవెనెత్తిన అంశాలు, అదానీ అంశంపై జేపీసీ వేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ప్రభుత్వం ఎదుకు స్పందించదు? అదానీతో మీకున్న సంబంధాలు ఏమిటి? ఈడీ, సీబీఐలను మాపైనే (విపక్షాల) ఉసిగొలుపుతారా? అదానీపై ఉండదా? పీఎంకేర్స్ ఫండ్‌పై మీరు ఆడిట్ చేయించారా? అని రౌత్ వరుస ప్రశ్నలు గుప్పించారు.
రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై వేటు వేయడానికి నిరసనగా విపక్షాల చేపట్టిన నిరసనల్లో తాము పాలుపంచుకుంటామని చెప్పారు. ''కుంభకోణంపై విపక్షాల ప్రశ్నలకు స్పందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మేము ప్రశ్నించకూడదా? ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారా? ఇంటి నుంచి గెంటేస్తారా? రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించడాన్ని వ్యతిరికిస్తూ జరుగుతున్న నిరసనల్లో మేము పాలుపంచుకుంటాం'' అని రౌత్ సష్టం చేశారు.
Updated Date - 2023-03-29T13:11:26+05:30 IST