Britain Parliament : బ్రిటన్ పార్లమెంటులో మోదీ ప్రస్తావన... ఘాటుగా స్పందించిన రుషి సునాక్...
ABN, First Publish Date - 2023-01-19T20:16:10+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి పాకిస్థానీ మూలాలున్న ఓ బ్రిటన్ ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించినపుడు ఆ దేశ
లండన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి పాకిస్థానీ మూలాలున్న ఓ బ్రిటన్ ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించినపుడు ఆ దేశ ప్రధాన మంత్రి రుషి సునాక్ (Rishi Sunak) ఘాటుగా సమాధానం చెప్పారు. మోదీపై బీబీసీ ఇటీవల ప్రసారం చేసిన డాక్యుమెంటరీని ఆ ఎంపీ ప్రస్తావించినపుడు ఈ సంఘటన జరిగింది.
బ్రిటన్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ, 2002లో జరిగిన గుజరాత్ హింసాకాండకు నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీయే బాధ్యుడని ఫారిన్ అండ్ కామన్‌వెల్త్ ఆఫీస్ మాటలనుబట్టే స్పష్టమవుతోందని చెప్పారు. వందలాది మందిని కిరాతకంగా చంపేశారని, వారి కుటుంబ సభ్యులు భారతదేశంలోనూ, బ్రిటన్‌లోనూ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉంటున్నారని, వారికి ఇప్పటికీ న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఫారిన్ ఆఫీస్‌లోని దౌత్యవేత్తలు ఈ హింసాకాండకు బాధ్యుడు మోదీయేనని చెప్తున్నారని, వారితో బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఏకీభవిస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ తీవ్రమైన నరమేధంలో మోదీ ప్రమేయం గురించి ఫారిన్ ఆఫీస్‌కి ఇంకా ఏమేం తెలుసునని ప్రశ్నించారు.
దీనిపై రుషి సునాక్ స్పందిస్తూ, ‘‘మిస్టర్ స్పీకర్, ఈ అంశంపై బ్రిటన్ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది, అది చిరకాలం ఉంటుంది, దానిలో మార్పు లేదు. అయితే, అణచివేత ఎక్కడ జరిగినా మేం సహించబోం, కానీ గౌరవ సభ్యుడు ప్రతిపాదించిన (మోదీ) పాత్ర చిత్రణ (characterization)తో నేను ఏకీభవిస్తున్నట్లు చెప్పలేను’’ అన్నారు.
బీబీసీ డాక్యుమెంటరీ
బ్రిటన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి దీనిని తొలగించారు. భారతీయ మూలాలుగల బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండించారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమి రేంజర్ మాట్లాడుతూ, 100 కోట్ల మందికిపైగా గల భారతీయుల మనసును బీబీసీ తీవ్రంగా గాయపరిచిందన్నారు.
భారత్ ఆగ్రహం
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని బాగ్చి అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నారు.
ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC), వ్యక్తుల ధోరణి కనిపిస్తోందని తెలిపారు. దీనిని ప్రసారం చేయడంలో ఎజెండా ఏమిటని ప్రశ్నించారు. గౌరవ, మర్యాదలతో పని చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీలో బ్రిటన్ మాజీ సెక్రటరీ జాక్ స్ట్రా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, జాక్ స్ట్రా ఏదో అంతర్గత బ్రిటన్ నివేదికను ప్రస్తావించినట్లు కనిపిస్తోందని, అది తనకు ఏవిధంగా అందుబాటులో ఉంటుందని ప్రశ్నించారు. అది ఇరవయ్యేళ్ళ క్రితంనాటి నివేదిక అని, దానిపైన మనం ఇప్పుడు ఎందుకు స్పందించాలని అడిగారు. జాక్ చెప్పినంత మాత్రానికి అది సరైనదని వారు ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే మాటలను తాను విన్నానని, వలసవాద ఆలోచనా ధోరణి అనే పదాలను మనం మాట్లాడటానికి ఓ కారణం ఉందని తెలిపారు. మనం పదాలను ఇష్టానుసారం వాడబోమన్నారు. ఇంక్వైరీ ఏమిటి? వారు అక్కడ దౌత్యవేత్తలు కదా? అన్నారు. ఇన్వెస్టిగేషన్ అంటే దేశాన్ని వారు పాలిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Updated Date - 2023-01-19T20:16:13+05:30 IST