SCO Meeting : భారత్ బయల్దేరిన పాక్ మంత్రి.. ఆసక్తికర ట్వీట్..
ABN, First Publish Date - 2023-05-04T14:16:37+05:30
భారత దేశంలో జరిగే షాంఘై సహకార సంఘం సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్
ఇస్లామాబాద్ : భారత దేశంలో జరిగే షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation-SCO) సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ (Bilawal Bhutto Zardari) గురువారం బయల్దేరారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. ఈ సమావేశాలు గురు, శుక్రవారాల్లో గోవాలో జరుగుతాయి.
ఎస్‌సీఓ అధ్యక్ష స్థానంలో ప్రస్తుతం భారత దేశం ఉంది. దీంతో మన దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) పాక్ విదేశాంగ మంత్రిని ఆహ్వానించారు. పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ ఇచ్చిన ట్వీట్‌లో బిలావల్ భుట్టో జర్దారీ కరాచీ నుంచి గోవాకు గురువారం బయల్దేరినట్లు తెలిపారు. గోవాలో జరిగే ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. పాకిస్థాన్ కోరిన మీదట భారత దేశ గగనతలంలో బిలావల్ విమానం ప్రయాణించేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు పాక్ మీడియా తెలిపింది.
బిలావల్ భుట్టో జర్దారీ ఇచ్చిన ట్వీట్‌లో, తాను గోవా వెళ్తున్నానని తెలిపారు. ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాలనే తన నిర్ణయం ఎస్‌సీఓ చార్టర్‌కు పాకిస్థాన్ కట్టుబడి ఉండటాన్ని వెల్లడిస్తుందని తెలిపారు. తన పర్యటనలో ప్రత్యేకంగా ఎస్‌సీఓపై దృష్టిసారిస్తామని చెప్పారు. ఈ సమావేశాల్లో మిత్ర దేశాల విదేశాంగ మంత్రులతో నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
భారత దేశ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో బిలావల్ భుట్టో సమావేశం కాబోరని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం
Updated Date - 2023-05-04T14:50:06+05:30 IST