Pakistan : కఠిన చర్యలకు సిద్ధమవుతున్న పాకిస్థాన్
ABN, First Publish Date - 2023-01-26T14:26:10+05:30
సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమేనని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్
ఇస్లామాబాద్ : సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన చర్యలకు సిద్ధమేనని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) తమ పట్ల ఉదారంగా వ్యవహరించేలా చూడాలని అమెరికాను కోరారు. వరదలు, ఇతర బాహ్య అంశాలు తమ దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ వివరాలను పాకిస్థాన్ మీడియా వెల్లడించింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్థిక సాయం కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ డిమాండ్లను అంగీకరిస్తే ధరలు మరింత పెరుగుతాయి. ఫలితంగా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పదు. అందుకే ఐఎంఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు.
అమెరికా ప్రతినిధి బృందం బుధవారం పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ బృందంతో ఇషాక్ దార్ మాట్లాడుతూ, తమ పట్ల ఐఎంఎఫ్ ఉదారంగా వ్యవహరించేలా చూడాలని కోరారు. వరదలు, ఇతర బాహ్య అంశాలు ఏ విధంగా తమను ప్రభావితం చేశాయో అర్థం చేసుకోవాలని కోరారు. అంతర్జాతీయంగా తాము చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటామని చెప్పారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పరిశీలనలో ఉన్న పొదుపు చర్యలు
ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు నేషనల్ ఆస్టెరిటీ కమిటీ చేసిన సిఫారసులను పాకిస్థాన్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. అవి ఏమిటంటే :
- సహజ వాయువు/విద్యుత్తు ఛార్జీల పెంపు
- మిలిటరీ, సివిల్ బ్యూరోక్రాట్లకు కేటాయించిన ప్లాట్ల స్వాధీనం
- ఎంపీల జీతాల్లో 15 శాతం కోత
- ఎంపీల డిస్క్రీషనరీ స్కీములపై నిషేధం
- ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు డిస్క్రీషనరీ ఫండింగ్‌పై నిషేధం
- ప్రీపెయిడ్ గ్యాస్/ఎలక్ట్రిసిటీ మీటర్ల బిగింపు
- జీతంతోపాటు ఇచ్చే అలవెన్స్ ఉపసంహరణ
- అన్ని స్థాయుల్లోనూ పెట్రోలు వాడకాన్ని 30 శాతం తగ్గించడం
- విదేశీ పర్యటనలపై నిషేధం
- విలాసవంతమైన వాహనాల కొనుగోలుపై నిషేధం
రుణ ఒప్పందంపై ఐఎంఎఫ్ సమీక్ష కోసం పాకిస్థాన్ ఎదురు చూస్తోంది. ఇది గత ఏడాది సెప్టెంబరు నుంచి పెండింగ్‌లో ఉంది. గత ఏడాది ఆగస్టులో సుమారు 1.1 బిలియన్ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది.
Updated Date - 2023-01-26T14:53:00+05:30 IST