Pakistan : సైన్యాన్ని విమర్శించిన పాకిస్థానీ హక్కుల ఉద్యమకారిణి అరెస్ట్
ABN, First Publish Date - 2023-08-22T16:52:27+05:30
పాకిస్థాన్ సైన్యాన్ని విమర్శించినందుకు మానవ హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది ఇమాన్ జైనబ్ మజరి-హజిర్ (26)ను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె తల్లి షిరీన్ మజరి 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. షిరీన్‌ను కూడా 2022 మే నెలలో అరెస్ట్ చేశారు.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సైన్యాన్ని విమర్శించినందుకు మానవ హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది ఇమాన్ జైనబ్ మజరి-హజిర్ (26)ను సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె తల్లి షిరీన్ మజరి 2018 నుంచి 2022 వరకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. షిరీన్‌ను కూడా 2022 మే నెలలో అరెస్ట్ చేశారు.
ఇమాన్ జైనబ్ మజరి-హజిర్ బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె పాకిస్థానీ సైన్యంపై గతంలో కూడా విమర్శలు చేశారు. సీనియర్ కమాండ్‌ను దూషించినట్లు, కించపరచినట్లు ఆమెపై 2022లో కేసు నమోదైంది. అయితే ఆమె తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం ప్రకటించడంతో ఆ కేసును ఉపసంహరించారు.
ఇమాన్ జైనబ్ మజరి-హజిర్ ఈ నెల 20న ఇస్లామాబాద్‌లో జరిగిన పష్తూన్ పరిరక్షణ ఉద్యమం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభలో ఆమె పాకిస్థాన్ సైన్యాన్ని ఉగ్రవాదులుగా అభివర్ణించారని ఆరోపణలు వచ్చాయి. ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘‘నిజమైన ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం జీహెచ్‌క్యూలో ఉండగా, మీరు ఉగ్రవాదులైనట్లుగా మిమ్మల్ని ఆపుతున్నారు’’ అని ఆమె చెప్పినట్లు కేసు నమోదైంది. ఈ సభ పూర్తయిన కొద్ది గంటల్లోనే ఆమె ఓ ట్వీట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. ఆమె తల్లి షిరీన్ మజరి ఇచ్చిన ట్వీట్‌లో, కొందరు మహిళా పోలీసులు, సాధారణ దుస్తులు ధరించిన పురుషులు తమ ఇంటి తలుపును పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారని, తన కుమార్తెను తీసుకెళ్లిపోయారని తెలిపారు. వారంట్లు ఇవ్వలేదని, ఎటువంటి చట్టపరమైన పద్ధతులను పాటించలేదని చెప్పారు. సెక్యూరిటీ కెమెరాలను, తన కుమార్తె ఉపయోగించే లాప్‌టాప్‌ను, సెల్‌ను తీసుకెళ్లిపోయారని తెలిపారు. తమ ఇంట్లో అన్ని మూలలకూ తిరిగారని చెప్పారు.
ఇమాన్ జైనబ్ మజరి-హజిర్‌తోపాటు మాజీ లా మేకర్ అలీ వజీర్‌ను కూడా అరెస్ట్ చేశారు. పష్తూన్లు, సైన్యం మధ్య దూరాన్ని పెంచేందుకు వీరు ప్రయత్నించారని, ఇస్లామాబాద్ వైపు కవాతు చేస్తామని బెదిరించడం ద్వారా వీరు ప్రజలను భయాందోళనలకు గురి చేశారని ఆరోపణలు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?
Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ
Updated Date - 2023-08-22T16:54:24+05:30 IST