Pakistan Petrol Price: లీటర్ పెట్రోల్‌పై ఒకేసారి 22 రూపాయలు పెరిగింది.. పాక్‌లో లీటర్ పెట్రోల్ ఎంతంటే..
ABN, First Publish Date - 2023-02-16T13:18:35+05:30
పాకిస్థాన్ ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఆహార పదార్థాలు సైతం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రజలు దినదినగండంగా గడుపుతున్నారు. ఆహార పదార్థాలు సైతం అందుబాటులో లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గురువారం తెల్లవారేసరికి వారికి మరొక పిడుగులాంటి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) నుంచి రుణం తెచ్చుకోవడం కోసం ప్రభుత్వం పెట్రోలు, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచినట్లు తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వద్ద అణుబాంబు ఉందని పాకిస్థాన్ మంత్రులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు తమపై పెట్రోలు బాంబును విసిరినట్లయిందని ప్రజలు వాపోతున్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వంలోని ఫైనాన్స్ డివిజన్ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు పాకిస్థాన్ రూపాయి విలువ తగ్గిపోయిందని, అందువల్ల పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నామని తెలిపింది. లీటరు పెట్రోలుపై రూ.22.20 (పాకిస్థానీ కరెన్సీ) పెంచినట్లు తెలిపింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.272కు చేరింది. హైస్పీడ్ డీజిల్ ధరను లీటరుకు రూ.17.20 చొప్పున పెంచినట్లు ఈ ప్రకటన పేర్కొంది. దీంతో లీటరు హైస్పీడ్ డీజిల్ ధర రూ.280కి చేరింది. కిరోసిన్ ధరను లీటరుకు రూ.12.90 చొప్పున పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో లీటరు కిరోసిన్ ధర రూ.202.73కు చేరింది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి వస్తాయని ఈ ప్రకటన పేర్కొంది.
పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం మినీ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించింది. పెట్రోలు, డీజిల్, విద్యుత్తు, గ్యాస్ ధరలను పెంచుతూ, తద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో రూ.170 బిలియన్లను ఆర్జించేందుకు ప్రతిపాదించింది. రెవిన్యూను పెంచుకోవాలని ఐఎంఎఫ్ చేసిన డిమాండ్‌కు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. 7 బిలియన్ డాలర్ల రుణంలో 1.1 బిలియన్ డాలర్లను విడుదల చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోవలసిందేనని ఐఎంఎఫ్ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మనీ బిల్లును ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ప్రతిపాదించారు.
పాకిస్థాన్‌లో ఇప్పటికే ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం సీఎన్‌జీ (compressed natural gas) ప్రజలకు అందుబాటులో లేదు. వంట గ్యాస్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కిరోసిన్‌ను వాడుతూ ఉంటారు. పాకిస్థాన్ ఉత్తర ప్రాంతాల్లో కిరోసిన్‌ను ఎక్కువగా వాడేది ఆ దేశ సైన్యమే.
వరదలు, కోవిడ్, ఉగ్రవాద దాడులు వంటివాటి వల్ల పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎంఎఫ్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఇస్లామాబాద్‌లో చర్చలు జరిపాయి. రుణం కావాలంటే ముందుగా తాము చెప్పే నిబంధనలను పాటించాలని ఐఎంఎఫ్ కరాఖండీగా చెప్పింది.
ఇవి కూడా చదవండి :
Tripura : బీజేపీ ఎమ్మెల్యేలను కొంటా : తిప్ర మోత పార్టీ చీఫ్
Updated Date - 2023-02-16T13:18:39+05:30 IST