India Vs China : మోదీ త్రిశూల వ్యూహంతో చైనాకు చెక్!
ABN, First Publish Date - 2023-02-16T15:53:03+05:30
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానం (Fortress Tibet policy)ని గట్టిగా తిప్పికొట్టేందుకు
న్యూఢిల్లీ : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) అమలు చేస్తున్న అజేయ టిబెట్ విధానం (Fortress Tibet policy)ని గట్టిగా తిప్పికొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా ఏడు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) బెటాలియన్ల ఏర్పాటు, శక్తిమంతమైన గ్రామం పథకం, షింకున్ కనుమ వద్ద సొరంగం నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. చైనాకు చెక్ పెట్టేందుకు ఇది త్రిశూల వ్యూహమని నిపుణులు చెప్తున్నారు.
ఈ మూడు నిర్ణయాలు పరస్పరం సంబంధం ఉన్నవే. టిబెట్, జింజియాంగ్‌లలో చైనా సైన్యం నిర్వహిస్తున్న మూడు అంచెల భద్రతా వ్యవస్థకు ఇది దీటైన సమాధానం చెప్పగలదు. సరిహద్దులకు సమీపంగా ఉండే గ్రామాల్లో బోర్డర్ గార్డ్స్, జిల్లా పోలీసులు, సైన్యాన్ని చైనా మోహరించింది. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఇటువంటి మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. ఏడు ఐటీబీపీ బెటాలియన్లను కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంటే మొత్తం మీద 8,400 మంది సిబ్బంది అందుబాటులోకి వస్తారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖ (LOC) వెంబడి బీఎస్ఎఫ్ భద్రత కల్పిస్తున్నట్లుగానే ఎల్ఏసీ వెంబడి కూడా భద్రతను భారత్ కట్టుదిట్టం చేయబోతోంది. ‘ఒక సరిహద్దు-ఒకే దళం’ విధానంలో భాగంగా ఎల్ఏసీ వెంబడి 3,488 కిలోమీటర్ల పొడవునా చైనాను ఎదుర్కొనేందుకు 56 బెటాలియన్లను మోహరించబోతోంది. ఈ దళానికి భారత సైన్యం, ఆర్మీ రిజర్వు అండగా నిలుస్తాయి. నక్సలైట్ల ఆగడాలను కట్టడి చేసేందుకు ఎనిమిది ఐటీబీపీ బెటాలియన్లను కేటాయించి, మిగిలినవాటిని చైనా సరిహద్దుల్లో మోహరిస్తారు. ఐటీబీపీ పూర్తిగా ఎల్ఏసీపైన మాత్రమే దృష్టి పెడుతుంది. ఐటీబీపీ ఏర్పాటు వెనుక లక్ష్యం కూడా ఇదే. పర్వత ప్రాంతాల్లో, గడ్డకట్టే చలిలో పోరాడే ప్రత్యేక నైపుణ్యం ఐటీబీపీ సిబ్బందికి ఉంటుంది. 12 వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐటీబీపీ సిబ్బందిని నియమిస్తారు.
కొత్త ఐటీబీపీ బెటాలియన్ల కోసం నియామక ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. కాబట్టి సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలలోని యువతకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని యువత ఉద్యోగావకాశాల కోసం పెద్ద నగరాలకు వెళ్ళకుండా, తమ స్వస్థలాల్లోనే ఉపాధి పొందడానికి వీలవుతుంది.
ఈ త్రిశూల వ్యూహంలో రెండోది, శక్తిమంతమైన గ్రామం పథకం (Vibrant Village Scheme). సరిహద్దులకు సమీపంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లోని యువత ఉపాధి కోసం నగరాలకు వెళ్తుండటం వల్ల ఎల్ఏసీ వద్ద రక్షణ, భద్రత బలహీనపడినట్లు ప్రభుత్వం గుర్తించింది. అందుకే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని జాతీయ భద్రత ప్రణాళికకర్తలు సూచించారు. ఈ నేపథ్యంలో రూ.4,800 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. స్థానిక యువత పర్యాటకం, వాణిజ్యం ద్వారా ఉపాధి పొందడానికి వీలుగా అన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తారు. దీని కోసం రూ.2,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
ఈ త్రిశూల వ్యూహంలో మూడోది, షింకున్ కనుమ వద్ద సొరంగం నిర్మాణం. దీనివల్ల వాస్తవాధీన రేఖతోపాటు సియాచిన్ మంచు కొండలు, దానికి సమీపంలో యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేయవచ్చు. హిమాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా ప్రయాణం, రవాణాలకు అవకాశం కలుగుతుంది. మనాలీ-అటల్ సొరంగం-దార్చా-షింకున్ కనుమ సొరంగం-పదుమ్-నీము యాక్సిస్ గుండా హిమాచల్ ప్రదేశ్-లడఖ్ మధ్య అనుసంధానం ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి :
Odisha : మహిళా పోలీస్ అధికారిని నెట్టేసిన బీజేపీ ఎమ్మెల్యే
Updated Date - 2023-02-16T15:53:07+05:30 IST