Pongal festival: రాష్ట్రప్రభుత్వం పరిశీలన.. పొంగల్ కానుకగా రూ.1,500?
ABN, First Publish Date - 2023-12-13T10:42:53+05:30
పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా పంపిణీ చేసే రూ.1,000 నగదును ఈసారి రూ.1,500కు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం
ప్యారీస్(చెన్నై): పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా పంపిణీ చేసే రూ.1,000 నగదును ఈసారి రూ.1,500కు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం పరిశీలిస్తోందని సచివాలయ వర్గాలు తెలిపాయి. రాజధాని నగరం చెన్నైలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు భారీనష్టం ఏర్పడిన విషయం తెలిసిందే. చెన్నై, తిరువళ్లూర్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల ప్రజలకు వరద సాయంగా రూ.6 వేలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. బాధితులకు ఈనెల 16నుంచి నగదు పంపిణీకి సంబంధించిన టోకెన్లు అందజేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసు(Minister Thangam Tennarasu) ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో, గృహిణులకు ఈ నెల 15వ తేది ఎప్పటిలాగే వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.1,000 జమకానుంది. ఇదిలా ఉండగా, పొంగల్ పండుగను జరుపుకోనున్న ప్రజలకు ఈ ఏడాది జనవరిలో చీర, ధోవతి సహా పొంగల్ సరుకులు పంపిణీ చేయనున్నారు. గత ఏడాది నగదు కానుకగా రూ.1,000 చొప్పున రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసింది. అయితే ఈసారి ఇప్పటివరకు పొంగల్ సరుకులు కొనుగోలు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టలేదని, ఈ సరుకులకు బదులుగా నగదుగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం 2.19 కోట్ల రేషన్ కార్డులకు రూ.1,500 నుంచి రూ.2,000 వరకు పొంగల్ పండుగకు వారం ముందు నుంచే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. 2024లో పార్లమెంటు ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్రప్రజలను తృప్తిపరిచే విధంగా డీఎంకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-12-13T10:42:55+05:30 IST