Parliament : పూర్వ వైభవం, ఆధునికత అనుసంధానం : రాష్ట్రపతి
ABN, First Publish Date - 2023-01-31T11:48:45+05:30
స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి మన దేశం పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో
న్యూఢిల్లీ : స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి మన దేశం పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో ప్రకాశించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆకాంక్షించారు. మానవతావాద కర్తవ్యాలను నెరవేర్చగలిగే స్వయంసమృద్ధ భారత దేశాన్ని మనం నిర్మించాలన్నారు. రానున్న పాతికేళ్లు అమృత కాలమని, ఈ కాలంలో అభివృద్ధి చెందిన భారత దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. మనందరి కోసం, దేశంలోని ప్రతి పౌరుని కోసం మన కర్తవ్యాలను నెరవేర్చవలసిన కాలం ఇది అని తెలిపారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం మాట్లాడారు. 2047నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తవుతాయి. నేటి నుంచి అప్పటి వరకు ఉన్న పాతికేళ్ళ సమయాన్ని అమృత కాలంగా అభివర్ణిస్తున్నారు. ఈ అమృత కాలాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో ముర్ము మాట్లాడుతూ, 2047 నాటికి మన దేశాన్ని పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో నిర్మించాలని ఆకాంక్షించారు. నేడు ప్రతి భారతీయుడి ఆత్మ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. నేడు ప్రపంచం మనల్ని చూస్తున్న తీరు అద్భుతమని తెలిపారు. గతంలో మనం ప్రపంచంపై ఆధారపడేవారమని, ఇప్పుడు ప్రపంచమే మనపై ఆధారపడుతోందని చెప్పారు. పేదరికంలేని భారత దేశాన్ని నిర్మించాలన్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా సంపన్నులు కావాలన్నారు. సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని తెలిపారు. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా భారత దేశం ఎదగాలన్నారు.
Updated Date - 2023-01-31T12:10:21+05:30 IST