Priyanka Gandhi Relishes Masala Dosa: కర్ణాటక ఎన్నికల సిత్రాలు.. ప్రియాంక గాంధీ స్పెషల్ దోశ.. వీడియో వైరల్..!
ABN, First Publish Date - 2023-04-26T16:27:12+05:30
'మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి' అని ఓ పాపులర్ డైలాగ్ రాజకీయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో..
మైసూరు: 'మడిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి' అని ఓ పాపులర్ డైలాగ్ రాజకీయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో నాయకులు ఇదే మంత్రాన్ని పఠిస్తుంటారు. ప్రజలతో మమేక మయ్యేందుకు, మేమూ మీలో ఒకరిమేనని.. చాటుకునేందుకు తంటాలు పడుతుంటారు. సామాన్య ప్రజానీకం వేషభాషలు అనుకరించడం, సంప్రదాయ నృత్యాల్లో పాల్గొనడం, కలిసి భోజనం చేయడం, రోడ్డు పక్కన హోటల్‌లో ఇరానీ ఛాయ్ తాగుతూ సందడి చేయడం వంటివి చేస్తుంటారు. సదురు నాయకుడు 'స్టార్ క్యాంపెయినర్' అయితే ఇక జనం చేసే సందడి కూడా అంతుండదు. కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌లలో ఒకరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మైసూరులో (Mysuru) ఇదే తరహాలో సందడి చేశారు. మైసూరులోని పురాతన ఫుడ్ జాయింట్‌లలో ఒకటైన మైలారీ హోటల్‌లో వేడివేడి దోసెలు వేసి అందర్నీ అబ్బురపరిచారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాతో కలిసి మైలారీ హోటల్‌ను వాద్రా సందర్శించారు. అల్పాహారం తీసుకున్న తర్వాత దోసె తయారీ నేర్చుకోవడంపై ప్రియాంక ఆసక్తిని కనబరిచారు. రెస్టారెంటు యజమాని సంతోషంగా ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్లగా, అక్కడి సిబ్బందితో ఆమె మాట్లాడారు. ఆ వెంటనే దోసె పెండెను పెనంపై వేసి సరైన ఆకారంలో తీర్దిదిద్దారు. దోసె తయరీ తర్వాత హోటల్ యజమానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ వారితో సెల్ఫీ దిగారు. ప్రియాంక దోసె తయరు చేస్తూ సందడి చేసిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ''నైపుణ్యం కలవారి చేతుల్లో పెర్‌ఫెక్ట్ దోసెలకు ఇది ఆరంభం మాత్రమే, ప్రపంచాన్ని ఏకతాటిపైకి తేగలిన వారి శక్తికి ఎల్లలు లేవు'' అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Updated Date - 2023-04-26T16:27:12+05:30 IST