Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ పరారీపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-22T12:26:56+05:30
వేర్పాటువాద ఖలిస్థాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పరారవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ
చండీగఢ్ : వేర్పాటువాద ఖలిస్థాన్ మద్దతుదారు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పరారవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ (Amarinder Singh Raja Warring) ఆరోపించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినప్పటికీ ఆయనను అరెస్టు చేయలేకపోయారంటే కేంద్ర ప్రభుత్వంతోపాటు, పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ కుట్ర ఉన్నట్లు భావించవలసి వస్తోందన్నారు. రాష్ట్రంలో, మరికొన్ని చోట్ల ఖలిస్థాన్ అనుకూల నిరసనల కేసులో అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్ కావలసి ఉంది. కానీ ఆయన ఐదు రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే.
అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, పోలీసు అధికారుల సమక్షంలోనే అమృత్‌పాల్ సింగ్ ఏ విధంగా పరారయ్యాడని ప్రశ్నించారు. ఆయనను పట్టుకోవడం కోసం రూపొందించిన ప్రణాళిక గురించి ఆయనకు ముందుగానే తెలుసునని దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చునన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంపై తనకు సందేహం ఉందన్నారు. దీని వెనుక కుట్ర ఉందన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి, ఖలిస్థాన్ గురించి మాట్లాడేవారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే అమాయక పంజాబీ యువతపై చర్యలు తీసుకోరాదన్నారు.
అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు ఐదు రోజుల నుంచి పోలీసులు, కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన జలంధర్‌లోని ఓ గురుద్వారాను సందర్శించారని, ఆ తర్వాత మోటార్ సైకిల్‌పై ప్రయాణించి, పారిపోయారని స్థానికులు చెప్తున్నారు. మార్చి 18న ఆయన జలంధర్ నుంచి ఓ కారులో పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌నుబట్టి తెలుస్తోంది. ఆయన మద్దతుదారుల్లో 154 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 12 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు, వీటిలో రైఫిల్స్, రివాల్వర్స్ ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఆయన ప్రయాణించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుండగా, అమృత్‌పాల్ సింగ్‌పై జాతీయ భద్రత చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఆయనపై మార్చి 18న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ అయింది. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ ఫొటోలను విడుదల చేశారు. వేర్వేరు రూపాల్లో ఈ ఫొటోలు ఉన్నాయి. ఆయనను అరెస్ట్ చేసేందుకు సమాచారం ఇవ్వాలని ప్రజలను పంజాబ్ ఐజీపీ సుఖ్‌చైన్ సింగ్ గిల్ కోరారు.
ఇవి కూడా చదవండి :
Delhi Liquor Policy: సౌత్‌గ్రూపు నిర్దేశించినట్లుగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ
Karnataka : ఎన్నికల్లో తాయిలాలకు బదులు ఇలా చేయండి : డాక్టర్ల సలహా
Updated Date - 2023-03-22T12:26:56+05:30 IST