MK Stalin Vs Governer: గవర్నర్‌ను సాగనంపండి.. రాష్ట్రపతికి సీఎం ఘాటు లేఖ
ABN, First Publish Date - 2023-07-09T20:39:15+05:30
తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం మరింత ముదురుపాకాన పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి అడుగడుగునా అడ్డుపడుతూ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
చెన్నై: తమిళనాడు (Tamilnadu) ప్రభుత్వానికి, గవర్నర్‌కు (Governer) మధ్య వివాదం మరింత ముదురుపాకాన పడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) అడుగడుగునా అడ్డుపడుతూ, రాజ్యాంగ పదవిని అడ్డుపెట్టుకుని అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు ఫిర్యాదు చేస్తూ సీఎం లేఖ రాసినట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రపతికి రాసిన లేఖలో గవర్నర్ ఉల్లంఘనల జాబితాను సీఎం ఏకరువు పెట్టారు. రాజ్యాంగానికి లోబడి ఉంటానని ప్రమాణం చేసి పదవిని చేపట్టిన గవర్నర్, ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి, కొద్ది గంటల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని, తద్వారా గవర్నర్ తన రాజకీయ వైఖరిని ప్రదర్శించారని ఫిర్యాదు చేశారు. మంత్రుల నియామకాలపై నిర్ణయాధికారం ముఖ్యమంత్రికే ఉంటుంది కానీ గవర్నర్లకు ఉండదని అన్నారు. విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బ చేసే అవకాశాల కోసం ఒక గవర్నర్ ఎదురు చూస్తున్నారంటే ఆయన కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలుకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని, లెజిస్లేచర్ పనితీరుకు అడ్డుపడుతున్నారని, అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, అడిగిన వివరణలు ఇచ్చిన తర్వాత కూడా అసాధారణ జాప్యం చోటుచేసుకుంటోందని సీఎం ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మంత్రులపై ఉన్న అవినీతి కేసులకు అనుమతించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
తమిళనాడు గవర్నర్ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని, సెక్యులరిజం మీద ఏమాత్రం నమ్మకం లేదని సీఎం స్టాలిన్ ఘాటుగా విమర్శించారు. మతం, హిందూయిజంను శ్లాఘిస్తూ, తమిళ సంస్కృతిని, ప్రజల మనోభావాలను కించపరుస్తున్నారని, రాష్ట్రం పేరు మార్చాలంటూ ఆయన ఇచ్చిన సూచనలు తమిళనాడుపై ఆయనకు ఉన్న విద్వేషాన్నే చాటుతుందన్నారు. అలాంటి వ్యక్తిని పదవిలో కొనసాగించడం సముచితం కాదని, అయితే ఆయనను పదవి నుంచి తొలగించాలా వద్దా అనే నిర్ణయాధికారం రాష్ట్రపతికే వడిచిపెడుతున్నానని ఆ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-07-09T20:39:15+05:30 IST