No-Confidence Motion : లోక్ సభలో రాహుల్ గాంధీ గర్జన.. బీజేపీ ఎంపీల తీవ్ర ఆగ్రహం..
ABN, First Publish Date - 2023-08-09T13:16:59+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు (బుధవారం) చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే భారత మాతను హత్య చేయడమేనన్నారు..
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు (బుధవారం) చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే భారత మాతను హత్య చేయడమేనని, మణిపూర్‌ను రెండు వర్గాలుగా విభజించారని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్‌కు ధన్యవాదాలు
అవిశ్వాస తీర్మానంపై రాహుల్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, ‘‘స్పీకర్ సార్, లోక్ సభలో నన్ను పునర్నియమించినందుకు ధన్యవాదాలు. గతంలో నేను మాట్లాడినపుడు, నేను అదానీ మీద, మీ సీనియర్ నేతల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందువల్ల నేను బహుశా మిమ్మల్ని బాధించి ఉంటాను. ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడను’’ అని చెప్పారు.
‘ఎందరో బలాన్నిచ్చారు’
సుప్రసిద్ధ పర్షియన్ కవి రుమిని ప్రస్తావిస్తూ, తాను బీజేపీ మీద అన్ని వైపుల నుంచి దాడి చేయబోవడం లేదన్నారు. ఈరోజు తాను తన హృదయాంతరాళాల్లోంచి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఎల్లప్పుడూ చేసే విధంగా ఈసారి ప్రభుత్వంపై భీకరంగా విమర్శల దాడి చేయబోనని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తనకు చాలా మంది గొప్ప శక్తిని, బలాన్ని అందించారన్నారు. ఈ యాత్రలో తనకు ఓ బాలిక ఓ లేఖ ఇచ్చిందని, అందులో, ‘‘రాహుల్, నేను మీతో కలిసి నడుస్తున్నాను’’ అని ఉందని తెలిపారు. ఆమె మాత్రమే కాకుండా అనేక మంది తనకు బలాన్ని ఇచ్చారని చెప్పారు. తనకు బలాన్నిచ్చినవారిలో రైతులు ఉన్నారన్నారు.
భారత్ జోడో యాత్ర గురించి..
ఈ యాత్రకు వెళ్లే ముందు తనలో అహంకారం ఉండేదని, అహంకారంతోనే తాను ఈ యాత్రను ప్రారంభించానని చెప్పారు. ఈ యాత్ర తన జీవితాన్ని మార్చేసిందన్నారు. ఈ యాత్రలో నిజమైన భారత దేశాన్ని చూశానని తెలిపారు. యాత్ర కోసం అన్నిటినీ త్యాగం చేయడానికి సిద్ధమయ్యానన్నారు. ప్రజా గళాన్ని విన్నానని చెప్పారు. ఈ యాత్రలో ప్రజలు తనకు ఎంతో సహాయం చేశారని, పేదల బాధలను అర్థం చేసుకున్నానని చెప్పారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించానని చెప్పారు. తాను సహాయక శిబిరాలకు వెళ్లానని, దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో తాను మాట్లాడానని తెలిపారు. కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడానని చెప్పారు. భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదని ఆరోపించారు. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. ఆయన ఆ రాష్ట్రానికి ఎన్నడూ వెళ్లలేదన్నారు. మణిపూర్ ఇక ఉండబోదన్నారు. మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదన్నారు. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని, మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారని ఆరోపించారు. బీజేపీ నేతలు ద్రోహులని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా రావణాసురుడితో పోల్చారు. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడని, మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారని, వారిద్దరూ అమిత్ షా, అదానీ అని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు దేశభక్తులు కాదని, దేశ ద్రోహులు అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార పక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది.
‘క్షమాపణ చెప్పాలి’
భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని, మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయేన ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
‘అవినీతికి ప్రతిరూపం ఇండియా కూటమి’
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, వారసత్వ రాజకీయాలు భారత దేశాన్ని విడిచిపెట్టిపోవాలన్నారు. ‘‘మీరు ఇండియా కాదు’’ అని దుయ్యబట్టారు. ‘‘మీది ఇండియా కాదు, అవినీతికి ప్రతిరూపం’’ అని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు. మణిపూర్ విడిపోలేదన్నారు. మణిపూర్ భారత దేశంలో అంతర్భాగమన్నారు. దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్రగల కాంగ్రెస్ భారత దేశాన్ని హత్య చేసినట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు. దేశంపట్ల తమకు చిత్తశుద్ధి ఉందని, కాంగ్రెస్ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మణిపూర్‌ను ఎవరూ విభజించలేరని, ముక్కలు చేయలేని స్పష్టం చేశారు.
ఈ గందరగోళం మధ్య రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి :
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..
Updated Date - 2023-08-09T14:01:20+05:30 IST