Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్
ABN, First Publish Date - 2023-08-13T09:59:14+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామికీకరణ చేశారని రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. టెక్నాలజీని అత్యంత మారుమూల ప్రాంతాలకు, నిరుపేదలకు చేరువ చేశారని చెప్పారు. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ పత్రికకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామికీకరణ చేశారని రైల్వేలు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) చెప్పారు. టెక్నాలజీని అత్యంత మారుమూల ప్రాంతాలకు, నిరుపేదలకు చేరువ చేశారని చెప్పారు. డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ వార్తా పత్రికకు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.
డేటా ప్రొటెక్షన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీనికి సంబంధించిన నిబంధనల రూపకల్పన, డేటా ప్రొటెక్షన్ బోర్డు ఏర్పాటు వంటి కార్యక్రమాలు జరగవలసి ఉంది. ఇవి కూడా పూర్తయితే ఈ చట్టం పని చేయడం ప్రారంభమవుతుంది. మరికొన్ని నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.
అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ నిబంధనల రూపకల్పన జరుగుతోందని చెప్పారు. ఈ నిబంధనలు చాలా స్పష్టమైన మాటలతో ఉంటాయన్నారు. ఇవి చాలా సులభంగా మార్చడానికి వీలుగా ఉంటాయన్నారు. టెక్నాలజీతోపాటు మారే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. చట్టం ఎంత సరళంగా ఉందో, అంతే సరళంగా, సులువుగా అర్థమయ్యే విధంగా ఉంటాయని చెప్పారు. ప్రధాని మోదీ టెక్నాలజీని అత్యంత నిరుపేదలకు, మారుమూల ప్రాంతాలకు చేరువ చేయడం ద్వారా దానిని ప్రజాస్వామికీకరణ చేశారని తెలిపారు. పిరమిడ్‌లో అట్టడుగున ఉన్నవారికి సైతం టెక్నాలజీని చేరువ చేశారన్నారు. చట్టం, నిబంధనల అమలు నియమావళి కూడా అదే సూత్రాన్ని అనుసరిస్తుందని చెప్పారు. మరికొద్ది నెలల్లోనే ఈ నిబంధనలను పార్లమెంటుకు సమర్పిస్తామన్నారు. స్వతంత్ర డేటా ప్రొటెక్షన్ బోర్డు, డిజిటల్-బై-డిజైన్ ఇంప్లిమెంటేషన్ స్ట్రక్చర్‌ల కోసం కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. ఈ చట్టం అమలు విషయంలో రానున్న కొద్ది నెలల్లో చాలా చర్యలను అమలు చేస్తామని చెప్పారు.
చట్టంలోని నిబంధనలను పరిశీలించినపుడు బోర్డు చాలా స్వతంత్రంగా ఉంటుందని అర్థమవుతుందని చెప్పారు. దీనికి ఉదాహరణ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అని తెలిపారు. సంపూర్ణమైన స్వతంత్ర వ్యవస్థకు సువర్ణమయమైన ఉదాహరణ అని చాలా మంది చెప్తున్నారని తెలిపారు. దీని చైర్‌పర్సన్‌ను, సభ్యులను ప్రభుత్వం నియమిస్తుందన్నారు. అయితే ట్రాయ్ చేయవలసిన పనులన్నిటినీ చట్టమే స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. అదేవిధంగా డేటా ప్రొటెక్షన్ బోర్డు గురించి కూడా చట్టం స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. సభ్యుల పదవీకాలం, కార్యకలాపాలు, ఏదైనా అంశాన్ని పరిశీలించినపుడు వెల్లడించవలసిన బాధ్యత, కూలింగ్ పీరియడ్ వంటివాటిని చట్టం స్పష్టంగా వివరించినట్లు చెప్పారు. డిజిటల్ ఎకానమీ గురించి స్పష్టమైన అవగాహన కలవారినే ఈ బోర్డులో నియమిస్తారని చెప్పారు.
డిజిటల్ ఇండియా, టెలికాం బిల్లులకు సవరణలు 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు చేపడతారా? అని ప్రశ్నించినపుడు అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్తూ, ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. డిజిటల్ ఎకానమీకి నూతన నిబంధనావళి అవసరమని చెప్పారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ నిబంధనావళి ఉండాలనేది మోదీ లక్ష్యమని చెప్పారు. టెక్నాలజీ మారినపుడు ఈ నిబంధనావళి తనంతట తానుగానే స్వీకరించే విధంగా ఉంటుందని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఈ ఫలితాలు చేరువ కావాలనేదే మోదీ లక్ష్యమని, టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేదే ఆయన ఆకాంక్ష అని తెలిపారు. ఈ చట్టాలన్నిటిలోనూ ఉన్న ఇతివృత్తం అదేనని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Ajit meets Pawar: కుటుంబ సన్నిహితుని ఇంట్లో కలిసిన పవార్ ద్వయం... మళ్లీ ఊహాగానాలు
Kaveri dispute: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. కావేరిపై సుప్రీంకోర్టుకు..
Updated Date - 2023-08-13T09:59:14+05:30 IST