India-Bharat row: దేశాన్ని చీల్చే ప్రయత్నంలో బీజేపీ: ఖర్గే
ABN, First Publish Date - 2023-09-08T18:50:29+05:30
ఇండియా-భారత్ వివాదంపై కేంద్రంలని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దేశాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నస్తోందని అన్నారు. భారత్‌ను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
రాజ్‌నంద్‌గావ్: ఇండియా-భారత్ (India-Bharat) వివాదంపై కేంద్రంలని అధికార బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. దేశాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నస్తోందని అన్నారు. భారత్‌ను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లా థెక్వా గ్రామంలో ఏర్పాటు చేసిన 'భరోసా కా సమ్మేళన్' కార్యక్రమంలో ఖర్గే శుక్రవారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఇండియా' అనే పదాన్ని బీజేపీ అసహ్యించుకుంటే 'స్టార్టప్ ఇండియా', 'డిజిటల్ ఇండియా', 'స్కిల్ ఇండియా', 'మేక్ ఇన్ ఇండియా' అనే పేర్లు ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పిస్తూ, భూపేష్ బఘెల్ ప్రభుత్వం ఐదేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో చేసిన పనులు ఒక్కసారి వచ్చి ఆయన చూడాలన్నారు.
''లోక్‌సభ ఎన్నికల కోసం మేము 'ఇండియా' కూటమిగా ఏర్పడ్డాం. దాంతో దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మారుస్తామని చెబుతోంది. రాజ్యాంగంలోనే భారత్, ఇండియా అనే రెండు పేర్లు ఉన్నాయి. అలాంటప్పుడు వారెందుకు ఇప్పుడు వివాదం రేపుతున్నారు?'' అని ఖర్గే ప్రశ్నించారు. తాము భారత్‌ను ప్రేమిస్తున్నామని, రాహుల్ గాంధీ సైతం భారత్ జోడో పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేశారని అన్నారు. భారత్‌ను ఐక్యంగా ఉంచే పనిలో తాము ఉండగా, బీజేపీ మాత్రం దేశాన్ని విడగొట్టాలని చూస్తోందని ఆరోపించారు.
జీ-20పై...
హింసాకాండతో అట్టుడికిన మణిపూర్ వైపు కనీసం ఒక్కసారి క కూడా చూడని ప్రధాని ఢిల్లీలో జి-20 సదస్సు నిర్వహిసున్నారని, ఎక్కడ చూసిన ఆయన ఫోటోలు, పోస్టర్లే దర్శనమిస్తున్నాయని అన్నారు. ఆయన మంత్రులు కానీ, మహాత్మాగాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటోలు కానీ ఎక్కడా కనిపించవని, అన్నీ మోదీ ఫోటోలేనని విమర్శించారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై..
సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడంపై మాట్లాడుతూ, మతం వేరు-రాజకీయాలు వేరనీ, రెండింటికీ ముడిపెట్టరాదని అన్నారు. ''ఎవరి మతం ఏమిటనే దానిపై మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. పేదలకు ఉద్దేంచిన భరోసా కా సమ్మేళన్‌కు వచ్చాను. మతం, రాజకీయాలు పరస్పర భిన్నమైనవి. రెండిటినీ కలిపి చూడరాదు. దానిపై చర్చించాలని నేను అనుకోవడం లేదు'' అని ఖర్గే స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-08T18:50:29+05:30 IST