Sanjay Raut: తాలిబన్, అల్‌ఖైదా తరహాలో ఈడీ, సీబీఐ... మోదీ సర్కార్‌పై రౌత్ ఫైర్
ABN, First Publish Date - 2023-03-06T15:58:44+05:30
నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ వ్యతిరేకులపై ఈడీ, సీబీఐలను ఉసికొలుపుతూ భయభ్రాంతులను చేస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. (Sanjay Raut)
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ వ్యతిరేకులపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసికొలుపుతూ భయభ్రాంతులను చేస్తోందని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఇది ఫాజిజాన్ని మించిపోయిందని, ప్రజాస్వామ్యం ఎంతమాత్రం కాదని చెప్పారు. అల్‌ఖైదా, తాలిబన్ సంస్థలను ప్రత్యర్థులపై దాడికి ఆయుధంగా వాడినట్టే మోదీ సర్కార్ తమ ప్రత్యర్థులపై ఈడీ-సీబీఐలను ఆయుధాలుగా వాడుతోందని విమర్శలు గుప్పించారు. కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపై తొమ్మిది మంది విపక్ష నేతలు మోదీకి సంయుక్తంగా లేఖ రాసిన మరుసటి రోజే సంజయ్ రౌత్ ఈ ఆరోపణలు చేశారు.
ఫాజిజంను మించిపోయేలా రాజకీయ ప్రత్యర్థులపై మోదీ సర్కార్ దాడులకు పాల్పడుతూ, భయభ్రాంతులను చేస్తున్నందునే విపక్ష నేతలు ప్రధానికి లేఖ రాశారని రౌత్ చెప్పారు. నిజానికి ఈ లేఖ అవసరమే లేదని, లేఖలోని విషయాలన్నీ మోదీకి తెలుసునని అన్నారు. ''ఆయన (మోదీ) ఉత్తర్వుల మేరకే ఇవి (దాడులు) జరుగుతున్నాయి'' అని రౌత్ ఆరోపించారు.
దీనికి ముందు, ఎక్సైజ్ పాలసీలో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసిడోయా అరెస్టుపై 8 రాజకీయ పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు ప్రధానమంత్రికి ఆదివారంనాడు లేఖ రాశారు. మన దేశం ప్రజాస్వామికమేనని మీరు అంగీకరిస్తారని భావిస్తున్నామని, కానీ ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను తీవ్ర స్థాయిలో ఉసిగొల్పి దుర్వినియోగపరచడం చూస్తుంటే..మనం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పరిణామం చెందినట్టు అనిపిస్తోందని నేతలు ఈ లేఖలో పేర్కొన్నారు. విపక్షాల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న తీరును విశ్లేషిస్తే, విపక్షమనేదే లేకుండా అంతం చేయడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్నారు. ఎన్నికల క్షేత్రం వెలుప ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్యాంగబద్ధ గవర్నర్ కార్యాలయానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రధానికి లేఖ రాసిన నేతల్లో బీఆర్ఎస్ చీఫ్ కె.చంద్రశేఖర రావు, జేకేఎన్‌సీ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, ఏఐటీసీ చీఫ్ మమతా బెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్, జేడీయూ, సీపీఎం నుంచి ప్రతినిధులు ఎవరూ ఈ లేఖపై సంతకం చేసిన వారిలో లేరు.
Updated Date - 2023-03-06T15:58:44+05:30 IST