Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి.. లేదంటే వారికి తీవ్ర అన్యాయం!
ABN, First Publish Date - 2023-09-20T12:56:29+05:30
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఢిల్లీ: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ఆమె తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమల్లోకి తీసుకురావాలని లేదంటే వారికి అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని ఈ బిల్లును మొదటగా తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ 7 ఓట్ల తేడాతో రాజ్యసభలో వీగిపోయిందని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పీవీ నరసింహారావు హయాంలో రాజ్యసభలో ఆమోదం పొందాక 15 లక్షల మంది మహిళలకు లాభం చేకూరిందని ఆమె చెప్పుకొచ్చారు.
"మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో జాప్యం చేస్తే భారతీయ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అన్ని అడ్డంకులను తొలగించి మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయండి. ఇది నా జీవితంలో కూడా ఒక ఉద్వేగభరితమైన క్షణం. తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించే రాజ్యాంగ సవరణను నా జీవిత భాగస్వామి, దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో 7 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పీవీ నరసింహారావు హయాంలోనే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నాయకులు ఎన్నికయ్యారు. అయినప్పటికీ రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయింది. కానీ ఆ కల ఇప్పుడు పూర్తవుతుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలని మేం ఆకాంక్షిస్తున్నాం. ఈ కోటాలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు వెంటనే కులగణన చేపట్టాలి’’ అని సోనియా గాంధీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
Updated Date - 2023-09-20T12:56:29+05:30 IST