గవర్నర్‌పై అధికార పార్టీ నేతల సంచలన కామెంట్స్.. రాజీనామా చేసి..
ABN, First Publish Date - 2023-05-20T07:34:31+05:30
గవర్నర్‌పై అధికార పార్టీ నేతలు సంచలన కామెంట్స్ చేశారు. రాజీనామా చేసి ఆ పార్టీలో చేరండంటూ..
చెన్నై, (ఆంధ్రజ్యోతి): విల్లుపురం, చెంగల్పట్లు జిల్లాల్లో కల్తీసారాకు 22 మంది మృతి చెందిన సంఘటనపై గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) ప్రభుత్వం నుంచి నివేదిక పంపమంటూ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని డీఎంకే(DMK) ధ్వజమెత్తింది. గవర్నర్‌కు గురువారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికను పంపిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వెలువడిన డీఎంకే పార్టీ పత్రిక ‘మురసొలి’లో గవర్నర్ తీరుపై విమర్శల వర్షం కురిపిస్తూ సుదీర్ఘ వ్యాసం ప్రచురితమైంది. కల్తీసారాకు అమాయకులైన 22 మంది మృతి చెందిన సంఘటనను ప్రధాన ప్రతిపక్షం సహా పలు పార్టీలు రాజకీయం చేస్తూ ప్రకటనలు జారీ చేస్తుండగా గవర్నర్ కూడా ఆ నాయకుల మాదిరిగా ఈ వ్యవహారంలో అనవసర జోక్యం చేసుకుని రాజకీయ నాయకుడిలా మారారని ఆ వ్యాసంలో ఆరోపించారు. కల్తీ సారా సంఘటనలకు సంబంధించి గవర్నర్ నివేదిక అడగటం తప్పుకాదని, అయితే అడిగిన విధానమే సమంజసంగా లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి నివేదిక కోరి ఉండవచ్చునని, అయితే నివేదికను కోరినట్లు ముందుగా ప్రసార మాధ్యమాలకు వార్తను వెల్లడించిన తర్వాత నివేదిక కోరుతూ లేఖను పంపినట్లు గవర్నర్ ప్రకటించడం గర్హనీయమన్నారు. నివేదిక కోరుతూ గవర్నర్ అడిగిన ప్రశ్నలన్నీ రాజకీయ నేతలు అడిగినట్లు ఉన్నాయేగానీ గవర్నర్ అడిగినట్లు లేవని తెలిపారు. ఈ ప్రశ్నలను అడగడానికి ముందు బీజేపీ అధికారంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్(Gujarat, Uttar Pradesh, Madhya Pradesh) రాష్ట్రాలలో విష సారాకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గవర్నర్ గుర్తుకు తెచ్చుకుని ఉండాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో సారాకు ఎందరో బలవుతున్నా ఆ రాష్ట్రాల గవర్నర్లు ఎవరూ ప్రభుత్వం నుండి ఎలాంటి నివేదికలు కోరలేదని, ఆ సంఘటనలు జరిగినట్లు కూడా భావించకుండా మసలుకున్నారనే విషయం గవర్నర్ ఆర్‌ఎన్ రవి తెలుసుకోవాలన్నారు. కల్తీసారాకు 22 మంది మృతి చెందిన వెంటనే రాష్ట్రప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టి బాధితులకు చికిత్సలందించటమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సారా వ్యాపారులను అరెస్టు చేసిందన్న విషయాన్ని కూడా గవర్నర్ పెద్దగా పట్టించుకోకుండా ఆ అరెస్టులపై అనుమానం వ్యక్తం చేయడం దారుణన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నామలై(Annamalai)లా తాను కూడా రాజకీయ నేతగా పేరుతెచ్చుకోవాలని గవర్నర్ తపిస్తున్నట్లు ఆయన వ్యవహర శైలి స్పష్టం చేస్తోందన్నారు. గవర్నర్‌గా తన ఉనికిని తెలియజేయడానికే పబ్లిసిటీ కోసం ఇలా వ్యవహరిస్తున్నారని ఆ పత్రికలో ఆరోపించారు. ప్రచారార్భాటమే ధ్యేయంగా రాజకీయ నాయకుడిలా వ్యవహరించాలనుకుంటే గవర్నర్ ఆర్‌ఎన్ రవి తన పదవిమి రాజీనామా చేయడం మంచిదని హితవు పలికారు.
Updated Date - 2023-05-20T07:34:31+05:30 IST