Sharad Pawar: అజిత్ పవార్‌కు పార్టీ పోస్టు ఎందుకు ఇవ్వలేదంటే..?
ABN, First Publish Date - 2023-06-10T20:19:03+05:30
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల విషయంలో ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె సుప్రియా సూలే. సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే అజిత్ పవార్‌కు నియామకాల్లో చోటు దక్కలేదు. దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు. అజిత్ ఇప్పటికే అసెంబ్లీలో ఎన్‌సీపీ విపక్ష నేతగా బాధ్యతలు నిర్వస్తున్నారని, పార్టీ డెసిషన్ మేకర్స్‌లో అజిత్ కూడా ఉన్నారని చెప్పారు.
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బాధ్యతల విషయంలో ఆ పార్టీ సుప్రీం శరద్ పవార్ (Sharad Pawar) కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule), సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ (Praful Patel)కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరినీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పవార్ ప్రకటించారు. సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, విమెన్ యూత్, లోక్‌సభ కోఆర్డినేషన్ బాధ్యతలు, ప్రఫుల్ పటేల్‌కు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. అయితే, తన మేనల్లుడు, తన తర్వాత పార్టీలో గట్టి పేరున్న నేత అజిత్ పవార్ (Ajit Pawar)కు ఈ నియామకాల్లో చోటుదక్కలేదు. ఎన్‌సీపీ 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారంనాడు ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవార్ ఈ నియామకాల ప్రకటన చేయగా, అజిత్ పవార్ సైతం వేదకపై ఉన్నారు.
ఇటీవల శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో అజిత్ పవార్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. అయితే, పార్టీ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తన నిర్ణయాన్ని పవార్ వెనక్కి తీసుకున్నారు. తాజాగా పార్టీ బాధ్యులను ప్రకటించే సమయంలోనూ అజిత్ పవార్‌ను పక్కనపెట్టడం ఒకింత ఆసక్తికరంగా మారింది.
శరద్ పవార్ ఏమన్నారంటే..?
పార్టీలో చేపట్టిన మార్పులు చేర్పుల్లో అజిత్ పవార్‌కు బాధ్యతలు అప్పగించకపోవడంపై శరద్ పవార్ తాజాగా వివరణ ఇచ్చారు. అజిత్ పవార్ ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌సీపీ విపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం పట్ల అజిత్ పవార్ సంతోషంగా ఉన్నారా అని అడిగినప్పుడు, కలిసే నిర్ణయం తీసుకున్నామని, డెషిషన్ మేకర్స్‌లో అజిత్ పవార్ కూడా ఉన్నారని పవార్ చెప్పారు.
శుభాకాంక్షలు చెప్పిన అజిత్ పవార్
కాగా, తాజా పరిణామాలపై అజిత్ పవార్ ఓ ట్వీట్‌లో స్పందించారు. కొత్తగా ఎన్నికైన కార్యనిర్వాహక అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలకు పార్టీ విలువైన సహకారాన్ని అందిస్తుందని, ఈ లక్ష్యం దిశగా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.
Updated Date - 2023-06-10T20:19:03+05:30 IST