Sharad Pawar: దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి... శరద్ పవార్ సంచలన వ్యాఖ్య
ABN, First Publish Date - 2023-06-07T17:10:41+05:30
దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
ఔరంగాబాద్: దేశంలో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు (anti-BJP Wave) వీస్తున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాలను పరిగణనలోకి తీసుకుని దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆలోచనా ధోరణి ఇదే తరహాలో కొనసాగితే రాబోయే ఎన్నికల్లో మార్పులు చోటుచేసుకుంటాయని ఔరంగాబాద్‌లో బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉండగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సైతం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో జరగాల్సి ఉన్నాయి. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశాలపై పవార్‌ను మీడియా ప్రశ్నించగా, తమ పార్టీతో పాటు మిత్రపక్షంలోని చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని, అయితే తాను మాత్రం అలా జరుగుతుందని అనుకోవడం లేదని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలతో కలిపి గందరగోళం సృష్టించాలని కేంద్రం అనుకోకపోవచ్చని అన్నారు. లోక్‌సభ ఎన్నికలపైనే వాళ్లు (బీజేపీ) దృష్టిసారించే అవకాశాలుంటాయని చెప్పారు.
తెలంగాణ మోడల్‌పై...
రైతులకు ఆర్థిక సాయం విషయంలో ''తెలంగాణ మోడల్''ను మహారాష్ట్రలో తీసుకువచ్చే అంశంపై అడిగినప్పుడు, తెలంగాణ మోడల్ ఏమిటో పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అదీగాక, తెలంగాణ చిన్న రాష్ట్రమని, చిన్న రాష్ట్రంలో ఆర్థిక సాయం చేయవచ్చని, అయితే సేద్యానికి సంబధించి మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు.
'మతం రంగు' మంచిది కాదు..
మహారాష్ట్రలో శాంతి భద్రతల పరిస్థితి, ఇటీవల కొన్ని హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడంపై పవార్‌ను ప్రశ్నించగా, రాష్ట్రంలోని చిన్న చిన్న అంశాలకు మతంరంగు పులుముతున్నారని, శాంతి భద్రతల విషయంలో పాలకులు బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. అధికార పార్టీ, వారి మనుషులు రోడ్లపైకి వచ్చి రెండు వర్గాల మధ్య విభేదాలvg సృష్టిస్తే అది ఎలాంటి మంచి సంకేతాలు ఇవ్వదని చెప్పారు. ఔరంగాబాద్‌లో ఏదో ఒక వ్యక్తి పోస్టర్‌ను కొందరు చూపిస్తే, పుణేలా హింస జరగాల్సిన అవసరం ఏముంది? కానీ అదే జరుగుతోందని ఆయన అన్నారు. ఇటీవల అహ్మద్‌నగర్‌లో ఇలాంటివి చూశామని, ఈరోజు కొల్హాపూర్‌లో చూస్తున్నామని, చిన్న విషయానికి ఫోన్లులో మెసేజ్‌లు పంపడం, మతం రంగుపూయడం, రోడ్ల మీదకు రావడం మంచిది కాదని, అధికార పార్టీలు ఇలాంటి ఘటనలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు.
ఫేవరెట్ మినిస్టర్ ఎవరంటే..?
నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్రంలో మీకు ఇష్టమైన మంత్రి ఎవరని పవార్‌ను మీడియా ప్రశ్నించగా, కొందరు తమ పనేదే తాము చేసుకుంటూ వెళ్తారని, వివాదరహితంగా ఉంటారని అన్నారు. నితిన్ గడ్కరిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ఆయన పార్టీ కోణంలోంచి ఆలోచించరని, ఎవరైనా ఒక సమస్యను ఆయన దగ్గరకు తీసుకువెళ్లే, ఆ వ్యక్తి ఎవరనేది కాకుండా ఆ అంశం ప్రాధాన్యత ఏమిటనే దానిపైనే గడ్కరి దృష్టి సారిస్తారని పవార్ ప్రశంసించారు.
పత్తి రైతు పరిస్థితి బాగోలేదు..
మహారాష్ట్రలో వ్యవసాయ సంబంధిత సమస్యలపై పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి పండించే రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అది జరక్కుంటే రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతారని, వారికి ఎన్‌సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ దృక్పథం మాత్రం ఆశావహంగా లేదని పవార్ అన్నారు. కోటా (ఎగుమతి) నిర్ణయం జరగలేదని, మరోవైపు చక్కెర ధరలు తగ్గుతున్నాయని, ఈ లెక్కలన్నీ చూసుకుంటే రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరేలా కనిపించడం లేదని అన్నారు.
Updated Date - 2023-06-07T17:11:49+05:30 IST