Sharad Pawar: మేనల్లుడికి పవార్ పరోక్ష హెచ్చరిక..!
ABN, First Publish Date - 2023-04-24T11:41:57+05:30
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా చీల్చే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ..
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని (NCP) ఎవరైనా చీల్చే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ చీఫ్, వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad Pawar) హెచ్చరించారు. ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షను పవార్ మేనల్లుడు అజిత్ పవార్ (Ajit Pawar) ఇటీవల వ్యక్తం చేయడం, ఇందుకు అనుగుణంగా ఆయన రాజకీయంగా పావులు కదుపుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో సీనియర్ పవార్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. "రేపు ఎవరైనా పార్టీని (NCP) చీల్చాలనుకుంటే అది వారి వ్యూహం అవుతుంది. మేము దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని అంతే కఠినంగా అమలు చేస్తాం'' అని పవార్ అన్నారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో సహా శివసేనకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటిస్తే ఎన్‌సీపీని అజిత్ పవార్ చీల్చే అవకాశం ఉందంటూ వినిపిస్తున్న వదంతులపై పవార్ ఆచితూచి స్పందించారు. ''ఈ అంశంపై మేము ఎలాంటి చర్చ జరపలేదు. దానిపై ఇప్పుడు మాట్లాడటం కూడా సరికాదు'' అని అన్నారు.
అజిత్ పవార్ బీజేపీలోకి వెళ్తారన్న ఊహాగానాలను గతంలోనూ శరద్ పవార్ కొట్టివేశారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. అయితే, తాజాగా అజిత్ పవార్ వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు తనకు 100 శాతం ఉన్నాయని, 2024లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందే సీఎం పోస్ట్‌ను ఎన్‌సీపీ క్లెయిమ్ చేస్తుందని అజిత్ పవార్ గత శుక్రవారంనాడు వ్యాఖ్యానించారు.
అజిత్‌కు మద్దతుగా సుప్రియ
కాగా, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే సైతం అజిత్ పవార్ రాజకీయ ఆకాంక్షకు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధపడుతున్నారని, రాజకీయాల్లో ఇలాంటి ఆకాంక్షలు ఉండటం తప్పేమీ కాదని అన్నారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ తమతమ ఆకాంక్షలు ఉంటాయని, దానిని బహిరంగం చేస్తే తప్పేమీ కాదన్నారు. నిజానికి అజిత్ పవార్ నిజాయితీగా తన కోరికను బయటపెట్టారని ఆమె అన్నారు. అజిత్ పవార్ ఎన్‌సీపీని విడిచిపెట్టి బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలపై ప్రశ్నించినప్పుడు, రాష్ట్రంలోని అభివృద్ధి పనుల విషయంలో తాను బిజీగా ఉన్నానని, అనేక ఆందోళకరమైన అంశాలు, రైతు అంశాలు వంటివి మనముందు ఉన్నాయని, ఇలాంటి తరుణంలో అజిత్ పవార్ గురించి ఏవోవో గాసిప్స్ మీడియాలో రావడం దురదృష్టకరమని అన్నారు.
ప్రాణం ఉన్నంతవరకూ...
కాగా, బీజేపీలో చేరవచ్చంటూ తనపై వస్తున్న ఊహాగానాలను అజిత్ పవార్ కొట్టివేశారు. తాను, తన విధేయులైన ఎమ్మెల్యేలు బీజేపీకి చేరువయ్యే ప్రసక్తే లేదని, తాను జీవించి ఉన్నంత కాలం ఎన్‌సీపీతోనే ఉంటానని అజిత్ పవార్ తెలిపారు. మరోవైపు, శరద్ పవార్ పార్టీని చీల్చేందుకు బీజేపీ ఒక పథకం ప్రకారం పావులు కదుపుతోందని ఎన్‌సీపీ అంటోంది.
Updated Date - 2023-04-24T11:41:57+05:30 IST