Manipur violence : మణిపూర్‌లో హింసపై సుప్రీంకోర్టు విచారణ
ABN, First Publish Date - 2023-07-10T13:36:12+05:30
మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసను మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని, అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని తెలిపింది. ఆ రాష్ట్రంలో హింసను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సోమవారం విచారణకు చేపట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణ మంగళవారం జరుగుతుంది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని పిటిషనర్లను కోరారు. తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొంజాల్వెస్ వాదనలు వినిపిస్తూ, మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ, గట్టి సూచన చేయాలని కోరారు. గొంజాల్వెస్‌ను ఉద్దేశించి చంద్రచూడ్ మాట్లాడుతూ, ‘‘శాంతిభద్రతలను మేం స్వాధీనం చేసుకునేలా మీ సంశయవాదం చేయజాలదు’’ అన్నారు. దీనిపై గొంజాల్వెస్ స్పందిస్తూ, మణిపూర్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయన్నారు. అందుకు చంద్రచూడ్ బదులిస్తూ, ‘‘రాష్ట్రంలో ఉన్న హింస, ఇతర సమస్యలను మరింత పెంచడం కోసం వేదికగా ఈ ప్రొసీడింగ్‌ను వాడుకోకూడదు. భద్రతా యంత్రాంగాన్ని లేదా శాంతిభద్రతలను మేం నడపలేం. సలహాలేమైనా ఇస్తే స్వీకరిస్తాం’’ అన్నారు. ఇది మానవతావాదానికి సంబంధించిన సమస్య అని, దీనిని పార్టీలకు సంబంధించిన అంశంగా చూడవద్దని తెలిపారు. ‘‘మీ మనోభావాలను అర్థం చేసుకున్నాం, అయితే ఈ న్యాయస్థానంలో వాదించడానికి కొన్ని పద్ధతులు ఉండాలి’’ అన్నారు.
మణిపూర్‌లో మెయిటీ తెగవారు తమను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ కుకీ, తదితర గిరిజన జాతులు మే 3 నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హింస భగ్గుమంది. ఇప్పటికీ హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ కాంగ్పొక్పి ప్రాంతంలో రాత్రికి రాత్రి జరిగిన ఘర్షణలో సోమవారం ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు, పది మంది గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి :
Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?
Panchayat Polls : మమత బెనర్జీని ఏకిపారేసిన దిగ్విజయ సింగ్
Updated Date - 2023-07-10T13:36:12+05:30 IST