Rahul Gandhi : పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట
ABN, First Publish Date - 2023-08-04T13:56:36+05:30
2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ : ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. ఆయన దోషి అని గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిలిపేసింది. దీంతో ఆయన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. 2019లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ దోషి అని తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోందని రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై పూర్ణేశ్ మోదీ గుజరాత్‌లోని సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కోర్టు గాంధీని దోషిగా తీర్పు చెప్తూ, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. గుజరాత్ హైకోర్టులో కూడా ఆయనకు ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు తాత్కాలికంగా ఉపశమనం కల్పించింది. ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపేసింది.
Updated Date - 2023-08-04T14:02:10+05:30 IST