Eradicate Sanatana Dharmam : మోదీపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం
ABN, First Publish Date - 2023-09-07T16:18:02+05:30
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంపై తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి తెలియకుండానే వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబట్టారు.
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మంపై తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల గురించి తెలియకుండానే వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను జారీ చేశారు.
డీఎంకే నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, వీటిని వ్యతిరేకించలేమని, నిర్మూలించడం ఒక్కటే సరైనదని, సనాతన ధర్మాన్ని కూడా సమూలంగా నిర్మూలించాలని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీని గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలపై దీటుగా, రాజ్యాంగబద్ధంగా, వాస్తవాలు చెప్తూ స్పందించాలని కేంద్ర మంత్రులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను సమర్థించారు. ప్రధాని మోదీపై మండిపడ్డారు. ప్రజలను అణచివేసే సనాతన ఆలోచనలను నిర్మూలించాలని ఉదయనిధి పిలుపునిచ్చారన్నారు. బీజేపీ పోషిస్తున్న సామాజిక మాధ్యమాల మూకలు ఉత్తరాది రాష్ట్రాల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయన్నారు. ఉదయనిధి తలకు వెల కట్టిన స్వామీజీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, కానీ ఉదయనిదిపై మాత్రం కేసులు నమోదు చేసిందని దుయ్యబట్టారు. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గ సమావేశంలో ఉదయనిధి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, దీటుగా బదులివ్వాలని చెప్పడం తనను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పారు. ఏ వార్త అయినా నిజమైనదా? కాదా? సరిచూసుకునేందుకు ప్రధాన మంత్రికి అన్ని వనరులు అందుబాటులో ఉంటాయని, ఉదయనిధి గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలను తెలుసుకోలేకపోతున్నారా? తెలిసి కూడా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!
ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించం!
Updated Date - 2023-09-07T16:18:02+05:30 IST